ఆరోగ్య రంగంలోకి ఎస్‌బీఐ.. కస్టమర్లకు మరో కొత్త స్కీమ్

by Anukaran |
SBI Debit Card EMI
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కొవిడ్ మహమ్మారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య రంగంలో రుణ సహాయాన్ని అందించేందుకు కొత్తగా ‘ఆరోగ్యం లోన్’ రుణ పథకాన్ని గురువారం ప్రారంభించింది. నగదు క్రెడిట్, టర్మ్ లోన్, బ్యాంక్ గ్యారెంటీ, లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా కొత్త రుణాలను పొందవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. కొత్త ఆరోగ్య వసతులు, ఫెసిలిటీ ఏర్పాట్ల విస్తరణ కోసం ఈ రుణాలను తీసుకోవచ్చని, కనిష్ఠంగా రూ. 10 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 100 కోట్ల వరకు రుణాన్ని తీసుకోవచ్చని ఎస్‌బీఐ వివరించింది. దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో నర్సింగ్ హోమ్, డయాగ్నస్టిక్ సెంటర్, పాథాలజీ ల్యాబ్‌లు, తయారీ, సరఫరా, దిగుమతిదారులు, లాజిస్టిక్ సంస్థలు రుణాలను పొందవచ్చు. రుణ చెల్లింపులకు 10 ఏళ్ల కాలవ్యవధిని నిర్ణయించినట్టు ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా చెప్పారు. మెట్రో సెంటర్లలో రూ. 100 కోట్ల వరకు, టైర్ 1, పట్టణ కేంద్రాల్లో రూ. 20 కోట్లు, టైర్ 2 నుంచి టైర్ 6 వరకు రూ. 10 కోట్లకు వరకు ఎస్‌బీఐ రుణాలను ఇవ్వనుంది. అంతేకాకుండా, హాస్పిటల్, ఆరోగ్య రంగంలోని కంపెనీలు రూ. 2 కోట్ల వరకు గ్యారెంటీ లేని రుణాలను బ్యాంకు ఇస్తుంది.

Advertisement

Next Story

Most Viewed