గోదావరిని కాపాడుతున్న సామాన్యుడు

by Shamantha N |
గోదావరిని కాపాడుతున్న సామాన్యుడు
X

దిశ, వెబ్‌డెస్క్: మొన్ననే దసరా అయిపోయింది. పూజలు, పునస్కారాలు, ఫలహారాలు, ప్రసాదాలు.. ఇలా అన్ని రకాలుగా ఎంజాయ్ చేశారు. కానీ ఆ తెల్లారుజామున పూజకు వాడిన పువ్వులు, ప్రసాదాలకు వాడిన కవర్లు, తీర్థం తీసుకున్న గ్లాసులు ఇవన్నీ ఒక పెద్ద కవర్‌లోకి చేరతాయి. మరి ఆ కవర్‌ను అన్ని రకాల చెత్తతో పాటుగా వేయలేం. ఎందుకంటే ఆ పూజ నుంచి వచ్చిన చెత్తను ఎక్కువగా జనసంచారం లేని చోట వేయాలి. కానీ సిటీల్లో ఉండే వారికి అలాంటి ప్రదేశాలు దొరకవు. కాబట్టి ఏదైనా చెరువులోనో, నదిలోనో వేసేయాలి. నాసిక్‌లో నివసించే వారు కూడా ఇలాగే అనుకున్నారు. అందుకే దసరా తెల్లారి ఇంట్లో పోగు చేసిన పూజ చెత్తను కవర్‌లో పట్టుకుని గోదావరి ఒడ్డుకు వచ్చారు. బండి కూడా దిగకుండా అమాంతం ఆ కవర్‌ను గోదావరిలో విసిరేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు విజిల్ ఊదుతూ ఒక హీరో ఎంట్రీ ఇచ్చాడు.

ఆ హీరో పేరు చంద్ర కిశోర్ పాటిల్. నాసిక్‌లో గోదావరి నదికి పక్కనే ఉన్న ఓ సొసైటీలో నివసిస్తుంటాడు. ప్రతి ఏడాది పండగ పూర్తయిన మరుసటిరోజు వచ్చి గోదావరి నది పక్కన రోడ్డు మీద విజిల్ పట్టుకుని నిలబడతాడు. ఎవరైనా ప్లాస్టిక్ చెత్తను గోదావరిలో వేయాలని ప్రయత్నిస్తే వారిని విజిల్ వేసి అడ్డుకుంటాడు. వారు పట్టుకొచ్చిన చెత్తను తీసుకుని పక్కన పెట్టుకుంటాడు. తాను ఇలా గత ఐదేళ్ల నుంచి చేస్తున్నట్లు, తన ఆరోగ్యం సహకరించినంత వరకు ప్రయత్నించనున్నట్లు చంద్ర కిశోర్ తెలిపారు. కొన్నిసార్లు కొంతమంది తన మాట వినకుండా వాగ్వాదానికి దిగుతారని, అలాంటి తరుణంలో తనతో పాటు బాటిల్‌లో తెచ్చుకున్న గోదావరి నీళ్లను తాగించి, వారికి గుణపాఠం వచ్చేలా చేస్తానని ఆయన అన్నారు. దసరాకు మరుసటిరోజు ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు చంద్ర కిశోర్ చేస్తున్న పని చూసి ఇంప్రెస్ అయిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ శ్వేతా బొద్దు, ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. అది చూసిన అందరూ చంద్ర కిశోర్ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు.

Advertisement

Next Story