భారత్‌లో పెట్టుబడి అవకాశాల అన్వేషణ కొనసాగుతుందన్న సౌదీ అరామ్‌కో!

by Harish |   ( Updated:2021-11-22 07:09:51.0  )
భారత్‌లో పెట్టుబడి అవకాశాల అన్వేషణ కొనసాగుతుందన్న సౌదీ అరామ్‌కో!
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన పెట్రోకెమికల్‌ వ్యాపారంలో సౌదీ అరామ్‌కోకు వాటా ఇచ్చే ఒప్పందం రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భారత్‌లో పెట్టుబడి అవకాశాల కోసం అన్వేషణను కొనసాగిస్తామని సౌదీ అరామ్‌కో ఓ ప్రకటనలో తెలిపింది. ‘ భారత్ దీర్ఘకాలికంగా అద్భుతమైన వృద్ధి అవకాశాలను కలిగిన దేశం. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే తమకున్న భాగస్వాములతో కలిసి కొత్తగా లేదంటే ఇప్పటికే ఉన్న వారితో వ్యాపార అవకాశాలను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తామని’ అరామ్‌కో పేర్కొంది. రిలయన్స్ సంస్థతో అరామ్‌కో సంస్థకు దీర్ఘకాల సంబంధాన్ని కొనసాగిస్తాం.

ఇదే సమయంలో భారత్‌లో పెట్టుబడుల అవకాశాలను వదులుకోమని కంపెనీ వివరించింది. రిలయన్స్ సంస్థ తన పెట్రోకెమికల్‌ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ అరామ్‌కోకు విక్రయించనున్నట్టు 2019 వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేశ్ అంబానీ చెప్పారు. 2020 నాటికి ఈ ఒప్పందం పూర్తవుతుందని స్పష్టం చేశారు. కానీ, అనుకున్న సమయానికి ఒప్పందం పూర్తి కాలేదు. కరోనా కారణమని చెప్పినప్పటికీ, ఆ తర్వాత కూడా దీనిపై స్పష్టత రాలేదు. ఇటీవలే సౌదీ అరామ్‌కో ఛైర్మన్ యాసిర్ అల్-రుమయ్యన్‌ను రిలయన్స్ సంస్థ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించింది. తాజాగా ఈ ఒప్పందం రద్దు అయినట్టు ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed