జిమ్మేదార్ ‘సర్పంచ్’.. కొవిడ్ విక్టిమ్స్‌కు నిస్వార్థ సేవలు

by Sridhar Babu |
జిమ్మేదార్ ‘సర్పంచ్’.. కొవిడ్ విక్టిమ్స్‌కు నిస్వార్థ సేవలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడం అంటే ఇదే. గద్దెనెక్కిన తరువాత దర్పం ప్రదర్శిస్తూ ఐదేళ్ల పాటు తన మాటే వేదం అన్నట్టుగా వ్యవహరించడం లేదా ప్రజాప్రతినిధి, ప్రజా సేవలో తలమునకలై జీవనం సాగించినప్పుడే తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చినట్టు అవుతుందని భావించారాయన. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల సర్పంచ్ గడీల గంగా ప్రసాద్ అందిస్తున్న సేవలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

92 కరోనా అంత్యక్రియలు..

కథలాపూర్, రుద్రంగి, మేడిపల్లి, కొడిమ్యాల తదితర మండలాల్లో కరోనా సోకి చనిపోయిన మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించారు. బాధిత కుటుంబం నుంచి ఫోన్ రాగానే సర్పంచ్ గంగా ప్రసాద్ తన పంచాయితీ సిబ్బందిని తీసుకుని హుటాహుటిన వెళ్లి.. చివరి తంతును కంప్లీట్ చేస్తున్నారు. కరోనా శవం అంటేనే గజగజ వణికిపోతున్నా తాండ్రియాల సర్పంచ్ బృందం మాత్రం భయమనేదే లేకుండా సేవ చేసేందుకు వెళ్తున్నారు. 92 శవాలకు అంత్యక్రియలు చేసినా వీరికి మాత్రం కరోనా సోకకపోవడం విశేషం. చివరి తంతు పూర్తి చేసేందుకు మొదటగా గంగా ప్రసాద్.. సొంత డబ్బులతో 80 పీపీఈ కిట్లు కొనుగోలు చేశారు. ఈ విషయం తెలిసిన దాతలు పీపీఈ కిట్లు అందజేస్తున్నారు. అయితే కరోనా శవం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సర్పంచ్ తన సొంత వాహనంలోనే పంచాయితీ సిబ్బందిని తీసుకొని వెళ్తారు తప్ప ఎవరి నుంచి కూడా డబ్బులు ఆశించడం లేదు.

ganga-Prasad

ఐసోలేషన్ సెంటర్..

గ్రామంలో పాఠశాలలోని రెండు గదుల్లో ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్‌ను కూడా సొంత ఖర్చులతో ఏర్పాటు చేయించారు. కరోనా సోకి ఇక్కడ చేరిన వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆహారం, ఫ్రూట్స్, ఇమ్యూనిటీ ఇచ్చే ఫుడ్‌ను ఉచితంగా అందజేస్తున్నారు. అలాగే కరోనా సోకి హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారికి ఇమ్యూనిటీ ఫుడ్ సప్లై చేస్తున్నారు. అలాగే గ్రామంలో ఎవరైనా కరోనా సోకి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలంటే అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా సర్పంచ్ తన కారులోనే తీసుకెళ్లి పరీక్షలు చేయించి తిరిగి ఇంటి వద్ద దింపుతున్నారు. గ్రామంలో 23 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా ప్రతీ ఒక్కరూ కూడా రికవరీ కావడం విశేషం.

స్వీయ అనుభవం వల్లే : గంగా ప్రసాద్

నా సొంత తమ్ముడికి కొవిడ్ సోకడంతో ఆసుపత్రిలో చేర్పించినప్పుడు పడ్డ బాధ అంతా ఇంతా కాదు. ప్రాక్టికల్‌గా అనుభవించిన నేను గ్రామ సర్పంచ్‌గా ఊర్లో.. కరోనా బాధితులు ఆ కష్టాలు పడవద్దన్న ఆలోచనతోనే సేవలు అందించేందుకు ముందుకు వచ్చాను. కరోనా బాధితులను వ్యక్తిగతంగా కలిసి.. వారిలో మనో ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేశాను. లేనట్టయితే బాధితులు మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. దీనివల్ల కరోనా వ్యాధి కన్నా.. ఎక్కువ మంది భయంతోనే ప్రాణాలు కోల్పోతున్నారని గమనించి నావంతు బాధ్యతను నేరవేర్చాను.

surpanch-ganga-prasad

Advertisement

Next Story

Most Viewed