సంఘీ వివాదం ఆర్బిట్రేషన్ కేంద్రానికి.. ఆమోదించిన ఎన్సీఎల్‌టీ..

by Shyam |   ( Updated:2021-12-23 12:00:22.0  )
సంఘీ వివాదం ఆర్బిట్రేషన్ కేంద్రానికి.. ఆమోదించిన ఎన్సీఎల్‌టీ..
X

దిశ, తెలంగాణ బ్యూరో: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభించిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు సానుకూల స్పందన లభిస్తున్నది. గిరీష్ సంఘీ సోదరులు, వారికి ఉన్న కంపెనీల మధ్య దాదాపు 13 ఏళ్ళుగా నలుగుతున్న కార్పొరేట్ వివాదం ఇప్పుడు పరిష్కారం కోసం ఈ కేంద్రానికి చేరుకున్నది. ఇంతకాలం ఎన్సీఎల్‌టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) దగ్గర ఈ పిటిషనర్లపై విచారణ జరుగుతూ ఉన్నది.

సత్వర పరిష్కారం కోసం ఆర్బిట్రేషన్ సెంటర్‌కు బదిలీ చేయడంపై ఎన్సీఎల్‌టీ ప్రెసిడెంట్ జస్టిస్ రామలింగం సుధాకర్, టెక్నికల్ సభ్యులు అరికెపూడి వీరబ్రహ్మారావు చొరవ తీసుకున్నారు. పిటిషనర్ల ఏకాభిప్రాయం మేరకు బదిలీ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఢిల్లీకి చెందిన లలిత్ మోడీ కుటుంబం కూడా వారి వివాదాన్ని పరిష్కరించుకోడానికి ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది.

గిరీష్ సంఘీ, రవి సంఘీ, వారి సోదరుల మధ్య సిమెంటు, సింథటిక్స్, పాలిజిప్స్, జిప్పర్ పరిశ్రమలకు సంబంధించిన వివాదం తలెత్తడంతో 2008లో ఎన్సీఎల్‌టీని ఆశ్రయించారు. అప్పటి నుంచి 13 ఏళ్లుగా విచారణ జరుగుతూనే ఉన్నది. మొత్తం ఆరు కేసుల విచారణ కొలిక్కిరాకపోవడంతో పరిశ్రమల నిర్వహణ కుంటుపడిందని అభిప్రాయపడిన ఎన్సీఎల్‌టీ సత్వరం పరిష్కరించుకోడానికి ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్లకు సూచించింది. సానుకూల స్పందన రావడంతో పిటిషన్లను బదిలీ చేస్తున్నట్లు ఎన్సీఎల్‌టీ స్పష్టం చేసింది. తదుపరి విచారణను జనవరి 28వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed