ఇసుకాసురుల ఇష్టారాజ్యం… వెనకున్నదెవరు…?

by Shyam |
ఇసుకాసురుల ఇష్టారాజ్యం… వెనకున్నదెవరు…?
X

దిశ మోత్కూరు : నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న వైనాన్ని ఆదివారం గ్రామస్తులు అడ్డుకోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా జానకిపురంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బస్వాపురం ప్రాజెక్టుకు ఇసుక తరలింపు పేరుతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని గ్రామానికి చెందిన యువకులు ఆరోపిస్తున్నారు. ఇసుక రవాణా చేసే వాహనాల వెంట వెళ్లి బస్వాపురం వెళ్లకుండా రాజధానికి తరలిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదని వాపోతున్నారు.

వాల్టా చట్టానికి విరుద్ధంగా తవ్వకాలు

భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని వాటిని కాపాడేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం వాల్టా చట్టాన్ని తెచ్చింది. ఆ చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం వాగుల్లో ఇసుక రవాణా చేయాల్సి వస్తే రెండు ఫీట్ల మేరకు, అది కూడ కూలీల చేత ఎత్తించాలి. అందుకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు హిటాచి లను ఉపయోగించి నిబంధనలను తుంగలో తొక్కి మైనింగ్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే సుమారు ఆరు ఫీట్ల లోతు వరకు ఇసుకను యంత్రాలతో తోడి అక్రమంగా రవాణా చేస్తున్నారు.

ఎమ్మెల్యే మంత్రి అండదండలతోనే అక్రమ రవాణా రవాణా

ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నాయని చెబుతున్నా కింది స్థాయి అధికారులు ఉత్తర్వులు చూపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లయితే ఎన్ని క్యూబిక్ మీటర్లు తీయాలనేది ఉత్తర్వుల్లో స్పష్టం చేయాలి. అవేవీ లేకుండా రవాణా చేసే వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా రవాణా చేయడం ప్రజలు అనుమానించడానికి అధికారులు ఊతం ఇస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యేల అండదండలు కాంట్రాక్టర్‌కు పుష్కలంగా ఉండటంతో ప్రైవేటు సైన్యాన్ని పెట్టి అప్పనంగా ఇసుకను తరలించడం జరుగుతుంది.

అక్రమ ఇసుక రవాణాలో అందరూ వాటాదారు లే:

అక్రమ ఇసుక రవాణాలో కిందిస్థాయి నుండి పైస్థాయి అధికారుల వరకు ముడుపులు అందుతున్న కారణంగానే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత లోడింగ్ చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ పక్కాగా సాయంత్రమే లోడింగ్ చేయడం రాత్రివేళల్లో రవాణా చేయడం నిత్యకృత్యంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఇసుక రవాణా అడ్డుకోవాల్సిన పరిస్థితులను కాంట్రాక్టరు, అధికారులే కల్పించారని రైతులు ఆరోపిస్తున్నారు.

కేసులు పెడతామని బెదిరించడం ఎందుకు

ఇసుక రవాణా కోసం అనుమతులు సక్రమంగా ఉన్నట్లయితే అటు పోలీసులు ఇటు రెవెన్యూ యంత్రాంగం గ్రామాల్లోకి వచ్చి ఇసుక రవాణా అడ్డుకుంటే కేసులు పెడతామని బెదిరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి ఇటు పోలీసుల నుండి గాని రెవెన్యూ అధికారుల నుంచి గానీ స్పష్టమైన సమాధానం లేదు

ఇసుక తరలింపుతో అడుగంటుతున్న భూగర్భ జలాలు

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దం కాలం తర్వాత వాగులు వంకలు పొంగిపొరలి రెండు సంవత్సరాల పాటు భూగర్భ జలాలకు డోకా లేదు. అనుకుంటే ఇసుక తోడేళ్ళ ఆకృత్యాలతో వ్యవసాయం మూలన పడే పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed