'కేసీఆర్ చెప్తేనే ఓటర్లకు డబ్బులు పంచారు'

by Shyam |
కేసీఆర్ చెప్తేనే ఓటర్లకు డబ్బులు పంచారు
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ సూచనల మేరకే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతూ మభ్య పెట్టారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డితో కలిసి హైదరాబాద్ బుద్ధభవన్‌లో ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి శశాంక్ గోయల్, రిటర్నింగ్ అధికారి ప్రియాంకకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే గ్రాడ్యుయేట్లకు విచ్చలవిడిగా డబ్బులు పంచారని ప్రభుత్వాన్ని విమర్శించారు. బాధ్యతాయుతమైన హోంమంత్రి మహమూద్ అలీ రాజ్యాంగ, ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారని, టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసినట్టు ప్రకటించడాన్ని సీరియస్ గా పరిగణించాలని ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు. ఆయన ఓటును తొలగించి ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శశాంక్ గోయల్ ను కోరారు.

అలాగే తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కూడా దొంగ ఓటు వేశారని, ఆమెపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని సంపత్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story