ఉప్పు 'చిటికెడు'!

by  |
ఉప్పు చిటికెడు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో లాక్‌డౌన్ వల్ల అనేక వ్యాపారాలు 40 రోజుల పాటు మూసేయబడ్డాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా, ఉత్పత్తి రంగం భారీగా క్షీణించింది. ముఖ్యంగా మనం రోజూ వంటల్లో వాడే ఉప్పు ఉత్పత్తికి సైతం లాక్‌డౌన్ తప్పలేదు. ఉత్పత్తి నిలిచిపోవడంతో రానున్న రోజుల్లో ఉప్పు కొరత ఏర్పడే ప్రమాదం ముంచుకొస్తోంది. లాక్‌డౌన్ కారణంగా దేశంలోని సముద్ర తీరప్రాంతాల్లో కర్మాగారాలు ఉప్పు ఉత్పత్తిని ఆపేయడంతో స్టాక్ కొరత ఏర్పడింది. కార్మికులు లేకపోవడం, రవాణా సౌకర్యం ఆగిపోవడం, అంతర్-జిల్లా ప్రయాణాలకు పరిమితులు ఇలా అన్ని రకాలుగా ఇబ్బందులు ఏర్పడటంతో ఉప్పు ఉత్పత్తి నిలిచిపోయింది.

సాధారాణంగా సముద్ర తీర ప్రాంతాల్లో అక్టోబర్, జూన్ మధ్య కాలంలో ఉప్పును ఉత్పత్తిని చేస్తారు. మార్చి, ఏప్రిల్ మధ్య ఎండకాలం కావడంతో ఉప్పు మడులు కట్టి ఎక్కువ ఉత్పత్తిని నిర్వహిస్తారు. రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 95 శాతం ఉప్పు ఉత్పత్తి ఉండగా, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తక్కువ పరిమాణంలో ఉత్పత్తిని జరుపుతున్నాయి. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా 200 లక్షల టన్నుల నుంచి 250 లక్షల టన్నుల ఉప్పు తయారీ జరుగుతుంది.

సీజన్ అయిపోతే పరిస్థితేంటి…

ఈ అంశంపై స్పందించిన ఇండియన్ సాల్ట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు లాక్‌డౌన్ విధించడంతో ఉప్పు ఉత్పత్తి తగ్గిందని వెల్లడించింది. మార్చిలో చివరి పది రోజులు, ఏప్రిల్ నెల మొత్తం ఉత్పత్తిని కోల్పోయామని అసోసియేషన్ పేర్కొంది. సరిగ్గా, ఉత్పత్తికి అనువైన కాలంలోనే ఇలాంటి ఉత్పాతం ఎదురవడం వల్ల ఎక్కువ నష్టపోయామని చెప్పారు. సీజన్ గరిష్టంగా 40 రోజులకు పైనే ఉంది. ఇండియాలో ప్రతి సంవత్సరం 95 లక్షల టన్నుల ఉప్పును వినియోగిస్తారు. పరిశ్రమల నుంచి 110 నుంచి 130 లక్షల టన్నుల మధ్య డిమాండ్ ఉంటుంది. సుమారు 60 లక్షల టన్నుల ఉప్పు ఇతర దేశాలకు ఎగుమతులు జరుగుతాయి. పరిశ్రమలు తయారు చేసిన ఉప్పును అధికంగా చమురు శుద్ధి కర్మాగారాలు, రసాయన తయారీదారులు, లోహపు కర్మాగారాలు, విద్యుత్ ప్లాంట్లు, సౌర విద్యుత్ సంస్థలు, వస్త్ర తయారీదారులు, రబ్బరు, తోలు తయారీదారులు వాడతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉప్పు కొరతను రానున్న 45 రోజుల్లోగా తీరుస్తారా అనేది సందేహంగా మారింది.

వర్షాకాలంలో కష్టమే…

ఉప్పుని నిర్దిష్ట ప్రదేశంలో పల్లం స్థాయిని బట్టి ఉత్పత్తి చేస్తారు. ఈ ఉత్పత్తి చక్రం 60 నుంచి 80 రోజుల సమయం ఉంటుంది. రానున్న తక్కువ కాలంలో ఉత్పత్తిని పెంచలేకపోతే, మిగిలిన సీజన్‌కు స్టాక్ ఉండదు. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే పరిశ్రమల నుంచి డిమాండ్ పెరిగితే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇండియన్ సాల్ట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ చెప్పారు. రానున్న వర్షాకాలంలో ఉప్పు ఉత్పత్తికి తీవ్ర ఆటంకాలు ఏర్పడుతాయని ఆయన వెల్లడించారు.

టాటా సాల్ట్ ధీమా…

గుజరాత్ రాష్ట్రంలో సుమారు 80 శాతం ఉప్పులో అత్యధికంగా కచ్ ప్రాంతం నుంచే వస్తుంది. ఆ ప్రాంతం ఉప్పు తయారీకి అనూకులం కావడమే దీనికి కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో కచ్‌లో కూడా ఉప్పు ఉత్పత్తి తగ్గినప్పటికీ, టాటా వంటి తయారీ కంపెనీలు సరఫరా మార్గాలను కొనసాగించాలని అభిప్రాయపడుతున్నాయి. టాటా సాల్ట్ చేసే ఉత్పత్తిలో ఎలాంటి కొరతా లేకుండా కార్యకలాపాలను సాధారణ స్థాయికి కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకూ ఉన్న నిల్వ, ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలు మిగిలిన సీజన్‌కు కూడా సరిపోతాయని టాటా కెమికల్స్ సీవోవో సోహాబ్ తెలిపారు.

ఉప్పు లేకుండా ఉండగలమా..

ఏదేమైనా, ఇండియన్ సాల్ట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ చెబుతున్న దాని ప్రకారం..ఉప్పు నిల్వలు బాగా తక్కువున్నాయని, కొరత ఏర్పడే పరిస్థితి ఉందని, అధిగమించడానికి తగిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయా లేదా అనేది చెప్పలేమనీ అంటున్నారు. అయితే, మరీ అంత ఇబ్బంది పడతామని అనుకోవట్లేదని సాల్ట్ రిటైల్ వ్యాపారస్తులు చెబుతున్నారు. లాక్‌డౌన్ కాలంలో రెట్టింపు స్థాయిలో వంటలను చేసుకుని ఉప్పు వాడేశాం కావున తర్వాత రానున్న రోజుల్లో ఉప్పుకష్టాలు ఎలా తీరుతాయో చూడాలి.

Salt, kutch, Indian Salt Manufacturers Association, salt shortage


Next Story

Most Viewed