41 శాతం క్షీణించిన ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు

by Harish |
cars1
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆటో పరిశ్రమలో సెమీ కండక్టర్ల కొరత కారణంగా సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 41 శాతం క్షీణించాయని వాహన తయారీదార్ల సంఘం సియామ్‌ వెల్లడించింది. చిప్‌ల కొరత వల్ల దాదాపు అన్ని ప్రముఖ వాహన తయారీ కంపెనీలు ఉత్పత్తి కార్యకలాపాలను తగ్గించడంతో సెప్టెంబర్‌లో మొత్తం 1,60,070 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. టాటా మోటార్స్ సంస్థ సియామ్‌కు నెలవారీ డేటాను ఇవ్వడం నిలిపేయడంతో ఈ క్షీణత 37 శాతంగా భావించవచ్చని సియామ్ తన నివేదికలో తెలిపింది. 2020, సెప్టెంబర్‌లో మొత్తం 2,93,226 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవగా, ఈ ఏడాది ఆగస్టులో 2,60,242 యూనిట్లు విక్రయించబడ్డాయి. వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యత పెరగడంతో వినియోగదారుల నుంచి డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పటికీ చిప్‌ల కొరత ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ ఏడాది దసరా, దీపావళి పండుగల సమయంలో కంపెనీలు వినియోగదారులకు వాహనాల డెలివరీ చేయడంలో కూడా పలు సవాళ్లను ఎదుర్కొన్నాయని కంపెనీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం పరిశ్రమ మొత్తం 5 లక్షలకు పైగా ఆర్డర్లను పెండింగ్‌లో ఉంచాయి. సమీక్షించిన నెలలో ద్విచక్ర వాహన విభాగంలో కూడా అమ్మకాలు 17 శాతం తగ్గిపోయి 15,28,472 యూనిట్లుగా నమోదయ్యాయి. కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ వల్ల ఎంట్రీ లెవెల్ మోటార్‌సైకిళ్ల కొనుగోళ్లు భారీగా తగ్గాయి. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లో వినియోగదారులు టూ-వీలర్ కొనేందుకు దూరంగా ఉన్నారు. మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 23 శాతం తగ్గి 9,48,161 యూనిట్లు, స్కూటర్ల విక్రయాలు 7 శాతం క్షీణించి 5,17,239 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ-వీలర్ అమ్మకాలు 54 శాతం పడిపోయి 29,185 యూనిట్లుగా నమోదయ్యాయి. ముడి వస్తువుల ధరలకు సంబంధించి సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. సరఫరా వ్యవస్థ సమస్యలను పరిష్కరిస్తూ ఉత్పత్తిని పెంచేందుకు పరిశ్రమ అన్ని చర్యలను తీసుకుంటోందని సియామ్ అధ్యక్షుడు కెనిచి అయుకవా అన్నారు.

Advertisement

Next Story