ధర్నాతో దిగొచ్చిన ప్రభుత్వం

by Anukaran |   ( Updated:2020-07-12 11:59:24.0  )
ధర్నాతో దిగొచ్చిన ప్రభుత్వం
X

దిశ, న్యూస్‌బ్యూరో: వేతనాలు పెంచాలని వరుసగా మూడు రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న గాంధీ ఆసుపత్రి నర్సుల ప్రయత్నం ఫలించింది. ధర్నా చేయడంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చింది. వారికి ప్రస్తుతం ఇస్తున్న రూ. 15,500 వేతనాన్ని రూ. 25,000 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది కేవలం ధర్నా చేసిన 212 మంది నర్సులకు మాత్రమే వర్తించనుంది. మిగిలిన ఔట్‌సోర్సింగ్ నర్సులకు ఈ పెంపు వర్తించే అవకాశం లేకుండా కేవలం, 212 మందికి మాత్రమే ఇన్సెంటివ్ రూపంలో పెరిగిన మొత్తాన్ని ప్రభుత్వం అందించనుంది. వైద్య మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది.

ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న 212 మంది అవుట్ సోర్సింగ్ నర్సులు జీవో నెంబరు 14 ప్రకారం భర్తీ అయ్యారు. వీరికి రూ .17500 జీతం అందుతోంది. కానీ కరోనా పరిస్థితుల్లో కొత్త రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వం కొత్తగా నర్సులను ఔట్‌సోర్సింగ్ పధ్ధతిలో నియమించింది. వీరికి రూ .25 వేల జీతాన్ని ఖరారుచేసింది. దాదాపు పద్నాలుగేళ్ళుగా పనిచేస్తున్న తమకంటే కొత్తగా రిక్రూట్ అయినవారికి ఎక్కువ జీతం ఇవ్వడాన్ని తప్పుపట్టిన 212 మంది నర్సులు మూడు రోజులుగా ధర్నా చేస్తున్నారు. జీవో నెం. 14కు సవరణ చేసి జీతాలను పెంచినట్లయితే రాష్ట్రంలోని మొత్తం ఔట్‌సోర్సింగ్ నర్సులకు వర్తిస్తుంది కాబట్టి కేవలం వీరికి మాత్రమే పెంచేలా ఇన్సెంటివ్ రూపంలో అందజేయాలని ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

Advertisement

Next Story