తెలంగాణలోనే సాలరీస్ ఎక్కువ

by Anukaran |
తెలంగాణలోనే సాలరీస్ ఎక్కువ
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 42% ఫిట్‌మెంట్, ఒక శాతం ‘తెలంగాణ ఇంక్రిమెంట్’ చొప్పున మొత్తం 43% ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ చేసినవారికి పింఛన్ల పేరుతో మొత్తం ఖర్చులో దాదాపు 30% మేర కేటాయిస్తోంది. రాష్ట్ర స్వీయ ఆర్థిక వనరులను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 40% ఈ అవసరాలకే పోతోంది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర స్వీయ ఆర్థిక వనరుల్లో 39.19%, మొత్తం రెవెన్యూ ఆదాయంలో 29.52%, రెవెన్యూ ఖర్చులో 30.07% చొప్పున ఖర్చు చేస్తున్నట్లు పీఆర్సీ తన తాజా నివేదికలో పేర్కొంది. మరే అవసరం కంటే జీతాలు, పింఛన్లకే దాదాపు మూడవ వంతకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంది.

అధిక వేతనాలు ఇక్కడే

దేశంలోనే అత్యధిక వేతనాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణలోనే ఉన్నారని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నారని ప్రభుత్వమే పలు సందర్భాల్లో పేర్కొంది. పీఆర్సీ సైతం తన నివేదికలో 2016-17 నాటి గణాంకాలను ప్రస్తావించి పంజాబ్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల తర్వాత ఎక్కువ జీతాలు తీసుకుంటున్నది తెలంగాణ ఉద్యోగులేనని పేర్కొంది. రాష్ట్ర మొత్తం రెవెన్యూ ఖర్చులో సగటున 38% మేర వేతనాలు, పింఛన్లకు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రెవెన్యూ ఖర్చు రూ. 81,432 కోట్లు ఉంటే ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల కోసం రూ. 30,930 ఖర్చు చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర జీస్‌డీపీలో దాదాపు సగటున 5% మేర ఈ అవసరాలకే పోతోందని వివరించింది.

ఏటేటా ఖర్చు పెరుగుతోంది

గడచిన 20 ఏళ్ల కాలాన్ని విశ్లేషించి 2000వ సంవత్సరంలో రాష్ట్ర స్వీయ ఆర్థిక ఆదాయంలో 76.13% వేతనాలు, పింఛన్ల కోసం ఖర్చు చేస్తే 2013-14 నాటికి 57.54 శాతానికి తగ్గిందని పేర్కొంది. ఈ 14 ఏళ్ల కాలంలో అన్నింటి కంటే ఎక్కువ వేగంగా పెరిగింది వేతనాలు, పింఛన్ల ఖర్చేనని పీఆర్సీ పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక నిర్వహణను, వనరులను, అప్పులను, ఖర్చును, ఇతర కాపిటల్ ఎక్స్‌పెండీచర్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి అత్యంత కనిష్టంగా 7.5% మాత్రమే ఫిట్‌మెంట్ ఇచ్చేలా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిపోవడం, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోవడం, ఆర్థిక సాయం అందకపోవడంలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను సంతృప్తిపర్చే విధంగా ఎంత ఫిట్‌మెంట్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story