పాలసీదారుల జీవితాలతో ఆడుకుంటున్న సహార.. ఆందోళనలో బాధితులు

by Shyam |
పాలసీదారుల జీవితాలతో ఆడుకుంటున్న సహార.. ఆందోళనలో బాధితులు
X

దిశ, జడ్చర్ల : కాయాకష్టం చేసి భవిష్యత్తు అవసరాల కోసం పైసా పైసా కూడబెట్టి నమ్మకంతో దాచుకుంటే.. దాచుకున్న సంస్థే దోచుకుందని లబోదిబోమంటున్నారు బాధితులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని సహారా ఇండియా కార్యాలయంలో బాధితులు ఆందోళనకు దిగారు. గత 15 సంవత్సరాల నుండి తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఏజెంట్ల మాటలు నమ్మి డిపాజిట్ చేస్తే డిపాజిట్ కాలం ముగిసినా కూడా డబ్బులు తిరిగి ఇవ్వడంలేదని బాధితులు ఆందోళనకు దిగారు.

లక్షలాది రూపాయలు తమ పిల్లల భవిష్యత్తు కోసం సంస్థలో డిపాజిట్ చేస్తే సంస్థ వారు బాండ్లలో తేదీలను పొడిగించి ఇస్తున్నారు కానీ.. తమ చేతికి డబ్బులు ఇవ్వడం లేదని వాపోయారు. తమ డబ్బును తమకు ఇప్పించాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సహార సంస్థను సెబీ నిషేధించిందని కేసు సుప్రీంకోర్టులో నడుస్తోందని కేసు తేలేంతవరకూ డబ్బులు ఇవ్వడం కుదరదు అంటూ సహారా ప్రతినిధులు తెగేసి చెబుతున్నారు. కానీ, కరోనా చేసిన గాయాలతో ఇబ్బందులు పడుతున్న తమకు డబ్బులు కావాలి అంటూ ఎంత ప్రాధేయపడినా ఇవ్వడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed