రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి అకౌంట్ లోకి డబ్బులు

by Shyam |   ( Updated:2021-12-28 06:17:51.0  )
రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి అకౌంట్ లోకి డబ్బులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు యాసంగి రైతుబంధు పెట్టుబడి సాయం మంగళవారం నుంచి జమ కానుంది. ఎప్పటిలాగే రైతుల ఖాతాల్లోకి నేరుగా సొమ్మును బదిలీ చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖకు నిధుల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. ఈసారి దాదాపుగా రెండున్నర లక్షల ఎకరాల సాగు భూమి కొత్తగా పట్టాలకెక్కింది. రైతుల సంఖ్య కూడా పెరిగింది. రాష్ట్రంలో రైతాంగానికి రైతుబంధు సాయం కింద రూ. 7645 కోట్లు నేటి నుంచి పంపిణీ చేయనున్నారు.

పెరిగింది

రాష్ట్రంలో సాగు భూమి పెరిగింది. గత వానాకాలం సీజన్​ వరకు 1,50,18,000 ఎకరాలకు రైతుబంధు సాయం ఇవ్వగా.. ఈ వానాకాలం నుంచి కోటి 52 లక్షల 91 ఎకరాలకు అందనుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ వివరాలను వెల్లడించింది. గత సీజన్లో 63.25 లక్షల మంది రైతులు ఉంటే.. ఈసారి మాత్రం 66.61 లక్షలకు పెరిగారు. ఇక గత సీజన్​లో రూ. 7508 కోట్ల రైతుబంధు సాయం పంపిణీ చేయగా.. ఈసారి మాత్రం రూ. 7645 కోట్లకు పెరిగింది. అయితే గత జూన్‌ నుంచి ఈ నెల 10 వరకూ భూముల క్రయవిక్రయాలతో రెవెన్యూ రికార్డుల్లో నమోదైన రైతుల పేర్లను ఈ నెల 31లోగా నమోదు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈవో)ను వ్యవసాయశాఖ ఆదేశించింది. కొత్తగా భూములను కొన్న రైతులు ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకం, రెవెన్యూఖాతా వివరాలను తెచ్చి ఇస్తే రైతుబంధు పోర్టల్‌లో వివరాలను ఏఈవోలు నమోదు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా గత జూన్‌ నుంచి ఈ నెల 10 వరకూ కొత్తగా దాదాపుగా 2లక్షల మంది భూములకు సంబంధించిన క్రయవిక్రయాలు చేసినట్లు తేలింది. వారందరి వివరాలు నమోదు కావడంతో రైతులు, భూమి సంఖ్య పెరిగింది.

ఎకరం నుంచి ప్రారంభం

మంగళవారం నుంచి తొలుత ఎకరా భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది. రెండో రోజున ఎకరా నుంచి 2, మూడో రోజున 2 నుంచి 3 ఎకరాలు…ఇలా రోజూ ఎకరా విస్తీర్ణం చొప్పున పెంచుతూ సొమ్ము జమ చేయనున్నారు. కాగా బుధవారం నుంచి యాసంగి రైతుబంధు నిధులు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ప్రకటించారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏడు విడతల్లో రూ. 43,036.63 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, ఈ సీజన్ తో కలుపుకుని మొత్తం రూ. 50 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతులకు చెల్లించామన్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి ధరణి పోర్టల్ లో పట్టాదారులతో పాటుగా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్​ ద్వారా అందిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు అర్హులుగా గుర్తించామన్నారు. ఈ సీజన్ లో 66.61 లక్షల మంది రైతులకు 152.91 లక్షల ఎకరాల్లో పట్టాదారులున్నారని, వారికి రూ. 7645.66 కోట్లు జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మొత్తం పట్టాదారుల్లో 3.05 లక్షల ఎకరాలకు 94 వేల మంది రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులున్నట్లు వివరించారు. ఎకరా నుండి రెండు, మూడు, నాలుగు ఎకరాల లెక్కన గతంలో మాదిరిగా ఆరోహణా క్రమంలో నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు.

రైతుబంధు లబ్ధిదారులు

సీజన్​ రైతులు ఎకరాలు నిధులు
2021 వానాకాలం 63,25,695 150.18 లక్షల ఎకరాలు రూ. 7508 కోట్లు
2021 యాసంగి 66.61 లక్షలు 152.91 లక్షల ఎకరాలు రూ. 7645 కోట్లు

Read more: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రూ.1500లతో 35 లక్షలు పొందడిలా

Advertisement

Next Story

Most Viewed