Hyderabad: ప్రీ లాంచ్ పేరుతో భారీ మోసం!.. బాధితుల నుంచి రూ.200 కోట్లు వసూలు

by Ramesh Goud |   ( Updated:2024-11-23 03:36:03.0  )
Hyderabad: ప్రీ లాంచ్ పేరుతో భారీ మోసం!.. బాధితుల నుంచి రూ.200 కోట్లు వసూలు
X

దిశ, సిటీక్రైం : సొంతింటిని నిర్మించుకోవాలని కలగనే సామాన్యులను క్రికెటర్ కపిల్ దేవ్, మ్యూజిక్ డైరెక్టర్ కోటీ, మరో క్రికేటర్ ఎంఎస్‌కే ప్రసాద్ ఫొటోలతో కూడిన ప్రకటనలతో ఆకర్షించి దాదాపు 600 మందిని మోసం చేసిన ఆర్‌జే హోమ్స్ భాగోతం శుక్రవారం బయటపడింది. రియల్‌ఎస్టేట్ పేరుతో చేసిన మోసంలో మరో కంపెనీ చిట్టా వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి దాదాపు రూ.150 నుంచి రూ.200 కోట్లను ఆర్‌జే హోమ్స్ సంస్థ నిర్వాహకులు కొట్టేశారని ఫిర్యాదులు నమోదయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...ఆర్‌జే హోమ్స్ సంస్థ చైర్మన్ భాస్కర్ గుప్తా, డైరెక్టర్ సుధారాణి భార్యాభర్తలు. వీరు కూకట్‌పల్లిలో ఆర్‌జే హోమ్స్(ఆర్ హోమ్స్) కార్యాలయాన్ని ప్రారంభించారు. 2020లో ఘట్‌కేసర్ సమీపంలోని యమ్నంపేట్ వద్ద దాదాపు 7 ఏకరాల్లో వాసవీ బ్లిస్ హైట్స్ పేరుతో ఫ్లాట్స్‌ను నిర్మిస్తున్నట్లు ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనల్లో క్రికేటర్ కపిల్ దేవ్, ఎంఎస్‌కే ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ కోటీ ఫొటోలతో ఆకర్షించి ప్రీ లాంచ్ ఆఫర్ కింద మార్కేట్ ధరకు రూ.1,000 ఎస్ఎఫ్‌టీకి తక్కువగా ఇస్తున్నామని నమ్మించారు.

ఈ ఫ్లాట్‌లను 2023 కల్లా పూర్తి చేసి మీ సొంతింటి కలను తీరుస్తామని హామి ఇచ్చారు. అదే విధంగా పటాన్‌చెరు, ఖద్దనూరు వద్ద 9 ఎకరాల్లో ఫ్లాట్స్‌ను నిర్మిస్తున్నామని మొత్తం 600 మంది వద్ద రూ.150 నుంచి రూ.200 కోట్లు వసూలు చేశారు. కానీ ఘట్‌కేసర్ వద్ద ప్రారంభ దశలోనే నిర్మాణానికి సెల్లార్, ఫుట్టింగ్‌లు తీసి వదిలేయగా, ఖద్దనూరు వద్ద పనులు ప్రారంభించలేదు. పనుల ఆలస్యంపై బాధితులు ప్రశ్నించగా ప్రారంభంలో హెచ్ఎండీఏ నుంచి అనుమతులు రాలేదని, ఎన్నికల కారణంగా కొంత ఆలస్యం జరిగిందంటూ వాయిదాలు వేసుకుంటు వచ్చారు. కొన్ని సందర్భాలలో బాధితుల మీదకు విరుచుకుపడి దుర్భాషలాడి భయబ్రాంతులకు గురిచేశారు. 6 నెలల కిందట బాధితులంత ఫిర్యాదుకు సిద్ధమవ్వగా డబ్బు తిరిగి ఇస్తానని వెనకి తీసుకువచ్చారు. ఇప్పుడు మీరు ఏమన్నా చేసుకోండి, డబ్బులు తిరిగి ఇవ్వను అంటూ బెదిరిస్తుండడంతో బాధితులు శుక్రవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు చేరుకుని ఈఓడబ్ల్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు చెల్లించి నాలుగు సంవత్సరాలైన ఫ్లాట్స్ నిర్మించకుండా ఆర్‌జే హోమ్స్ సంస్థ మోసం చేసిందని, డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు దిగిన భాస్కర్ గుప్తా, సుధారాణిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed