ఢిల్లీ బౌలింగ్ కోచ్‌గా ర్యాన్ హారీస్

by Shyam |   ( Updated:2020-08-25 07:05:54.0  )
ఢిల్లీ బౌలింగ్ కోచ్‌గా ర్యాన్ హారీస్
X

దిశ, స్పోర్ట్స్: మరి కొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బౌలింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ ర్యాన్ హారీస్‌ను నియమించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ట్విట్టర్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న హారీస్ అక్కడి నుంచి నేరుగా దుబాయ్ చేరుకొని జట్టుతో కలవనున్నాడు.

గత రెండు సీజన్లలో ఢిల్లీ బౌలింగ్ కోచ్‌గా ఉన్న జేమ్స్ హాప్స్ వ్యక్తిగత కారణాలతో ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది జట్టుతో కలవలేనని యాజమాన్యానికి సమాచారం అందించాడు. వెంటనే తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా హ్యారీస్‌ను తీసుకుంది. ఆస్ట్రేలియా తరపున 27 టెస్టులు, 21 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడిన హ్యారీస్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 113 టెస్టు వికెట్లు, 44 వన్డే వికెట్లు, 4 టీ20 వికెట్లు హారీస్ ఖాతాలో ఉన్నాయి. డీసీ జట్టు హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్ వ్యవహరిస్తున్నాడు. అతనికి తోడు మహ్మద్ కైఫ్, శామ్యుల్ బద్రి, విజయ్ దహియాలు ఉండగా కొత్తగా హారీస్ వచ్చి చేరాడు.

గతంలో ఐపీఎల్‌లో 37 మ్యాచ్‌లు అడిన హారీస్, టైటిల్ గెలిచిన డక్కన్ చార్జర్స్ జట్టు సభ్యుడు. 2015లో గాయాల కారణంగా అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. బిగ్ బాష్ లీగ్ బ్రిస్బేన్ హీట్ కోచింగ్ సిబ్బందిలో కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో తిరిగి చేరడంపై హారీస్ స్పందించాడు. ‘ఐపీఎల్‌లో తిరిగి చేరడం చాలా సంతోషంగా ఉంది. టైటిల్ సాధించాలనే ఢిల్లీ క్యాపిటల్స్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను. వారందరితో కలసి పని చేయడానికి ఎదురు చూస్తున్నాను.’ అని హారీస్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed