పుతిన్‌ని కలిసిన డాక్టర్‌కు కరోనా పాజిటివ్

by vinod kumar |
పుతిన్‌ని కలిసిన డాక్టర్‌కు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు గతవారం మాస్కోలోని ప్రధాన కరోనా వైరస్ హాస్పిటల్‌ని దగ్గరుండి చూపించిన డాక్టర్‌కి కొవిడ్ వైరస్ సోకినట్లు తెలిసింది. గత మంగళవారం రోజున కొమ్మునార్క హాస్పిటల్‌ని పుతిన్ సందర్శించారు. అక్కడ డాక్టర్ డెనిస్ ప్రొట్సెంకో ఆయనకు దగ్గరుండి వాళ్లు ఉపయోగిస్తున్న రక్షణ పరికరాల గురించి వివరించి చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయటికి వచ్చింది.

అయితే తనకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలినట్లు ప్రొట్సెంకో ఒక ఫేస్‌బుక్ పోస్టు ద్వారా తెలిపారు. ఈ కారణంగా తనను తాను ఆఫీసులో స్వీయ దూరం పాటించే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ డాక్టర్ నుంచి పుతిన్‌కి కరోనా వైరస్ సోకిందా? అనే అనుమానం రష్యాలో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించి రష్యా అధ్యక్ష భవనం ఒక అధికారిక ప్రకటన చేసింది. పుతిన్‌ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నట్లు, ఆ పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్ వస్తోందని ప్రకటనలో పేర్కొంది. అయితే మంగళవారం నాటి హాస్పిటల్ పర్యటనలో పుతిన్ హాజ్మాట్ సూట్ ధరించి జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ ప్రొట్సెంకోతో తిరుగుతున్నపుడు మాత్రం ఆయన ఎలాంటి రక్షణ తీసుకోనట్లుగా ఉన్న ఫొటో ఈ అనుమానానికి కారణమైందని రష్యన్ మీడియా చెబుతోంది. అయితే ప్రొట్సెంకోతో ఎలాంటి ప్రత్యక్ష తాకిడి జరగలేదని క్రెమ్లిన్ స్పష్టం చేసింది.

Tags : Russia, Putin, Kremlin, Corona, COVID 19, Protsenko

Advertisement

Next Story

Most Viewed