ముందే మేల్కొన్నా.. కట్టడి చేయలేకపోయారు

by Shyam |
ముందే మేల్కొన్నా.. కట్టడి చేయలేకపోయారు
X

రష్యాలో ఉధృతంగా పెరుగుతున్న కరోనా కేసులు

దిశ వెబ్‌డెస్క్ :
కరోనా వైరస్‌కు రష్యా మరో కేంద్ర బిందువుగా మారుతోంది. చైనాలో వైరస్ పుట్టినట్లు గుర్తించిన వెంటనే ఆ దేశంతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసేసింది. రైళ్లు, విమానాల రాకపోకలను నిషేధించింది. దీంతో చైనాను ఆనుకునే ఉన్నా చాన్నాళ్ల వరకు రష్యాలో కొవిడ్-19 కేసులు పెద్దగా నమోదు కాలేదు. కరోనా వైరస్‌ను కట్టడి చేయగలిగామని.. మనకు ఇక ముప్పు లేదని స్వయంగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు కూడా వైరస్ భయాందోళనల నుంచి బయటకు వచ్చారు. కానీ, దేశానికి పశ్చిమ సరిహద్దు నుంచి వైరస్ ప్రవేశిస్తోందని అంచనా వేయలేకపోయింది. యూరోప్ దేశాల్లో వైరస్ ప్రబలుతున్న సమయంలో రష్యా అలసత్వం ప్రదర్శించింది. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ రష్యా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. యూరోప్ నుంచి భారీగా విదేశీ ప్రయాణికులు రష్యాలో ప్రవేశించడంతో వైరస్ తిరిగి ఉగ్రరూపం దాల్చింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో రోజుకు ఒకటీ అరా కేసులు నమోదవుతుండగా.. ఏప్రిల్ చివరి నాటికి రోజుకు 10 వేల కేసుల స్థాయికి చేరుకుందంటే రష్యా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా రష్యా ప్రధాని మిఖాయిల్ మిషూస్టిన్, మంత్రులు లూంబిమోవాన్, వ్లాదిమిర్ యకుషేవ్‌లు కూడా కరోనా బారిన పడ్డారు.

పుతిన్ అధికార కాంక్ష..

ఒకవైపు చైనాలో వైరస్ ప్రబలుతుంటే రష్యాలో ఆ దేశంతో ఉన్న సరిహద్దులు మూసేయడం, ప్రయాణాలు నిలిపేయడం మాత్రమే చేశారు. కాని లాక్‌డౌన్ మాత్రం ప్రకటించలేదు. ప్రజలు కూడా నిర్భయంగా రోడ్లపై సంచరించారు. భౌతిక దూరం పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మాటలను పాలకులు అమలు చేయలేదు. చివరకు ప్రపంచమంతా కరోనాపై పోరాటంలో ఉంటే.. ఆ దేశాధ్యక్షుడు పుతిన్ మాత్రం 2036 వరకు తానే అధ్యక్షుడిగా ఉండాలంటూ రాజ్యాంగాన్ని సవరించే పనిలో పడ్డారు. పుతిన్‌కు ఉన్న అధికార కాంక్షే నేడు రష్యాలో కరోనా సంక్షోభానికి కారణమని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో జర్మనీ, ఫ్రాన్స్‌లను దాటేసి రష్యా ఐదో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు రష్యాలో 1,98,676 కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా 10,817 పాజిటివ్‌లు నమోదయ్యాయి. రష్యాలో కొవిడ్ – 19 కారణంగా 1827 మంది చనిపోయారు.

మాస్కోను వదిలేస్తున్నారు..

దేశ రాజధాని మాస్కోలో కరోనా విలయతాండవం సృష్టిస్తుండటంతో ప్రజలు ఆ నగరంలో నివసించేందుకే భయపడుతున్నారు. ఇప్పటి వరకు అధికార లెక్కల ప్రకారం 10 లక్షల మంది మాస్కోను విడిచి వెళ్లారని చెబుతుండగా.. రాజధానిలో ప్రధాన వ్యాపారాలు, సంస్థలన్నీ మూతబడ్డాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కంపెనీలు, ఫ్యాక్టరీలు మూసేయడంతో ప్రజలకు ఉపాధి కూడా లేకుండా పోయింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై జీడీపీ దాదాపు 5 శాతానికి పడిపోయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా మేలుకోకపోతే మరింత నష్టపోవడం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed