బ్లాక్ ఫంగస్ కలకలం.. కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి రోగుల తాకిడి

by Shyam |
Koti ENT
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి బ్లాక్ ఫంగస్ రోగుల తాకిడి తగ్గడం లేదు. బ్లాక్ ఫంగస్ రోగుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక ఆస్పత్రి ఇదే కావడంతో.. అన్ని జిల్లాల నుండి రోగులు ఆస్పత్రికి వస్తుండడంతో రద్ధీ పెరిగింది. హాస్పిటల్‌లో గతంలో 200 పడకలు మాత్రమే ఉండగా.. మరో 30 పడకలను అదనంగా అధికారులు అందుబాటులోకి తెచ్చినా అవి ఏ మూలకు సరిపోవడం లేదు. ప్రతినిత్యం వందల సంఖ్యలో రోగులు బ్లాక్ ఫంగస్ వైద్యం కోసం ఇక్కడికి వస్తున్నారు. దీంతో హాస్పిటల్ ఆవరణలో ఎక్కడ చూసినా రోగులు, వారి సహాయకులు, అంబులెన్స్లు కనబడుతున్నాయి.

అయితే ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ నేతృత్వంలో వైద్యులు, సిబ్బంది ఉన్నంతలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ పలు సమస్యలు వేధిస్తున్నాయి. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ అందుబాటులో లేకపోగా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి వచ్చే బ్లాక్‌ ఫంగస్‌ రోగుల బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. చికిత్స కోసం తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రోగులు వస్తున్నప్పటికీ వారికి పడకలు దొరకక ఇబ్బందుల పాలవుతున్నారు. హాస్పిటల్ లో అడ్మీషన్ కోసం తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఆతృతతో ఎదురు చూస్తున్నారు . రాష్ట్రాల వివక్ష లేకుండా అందర్నీ చేర్చుకోవాలని రోగుల బంధువులు కోరుతున్నప్పటికీ పడకలు అందుబాటులో లేకపోవడం కారణంగా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాయి.

బ్లాక్ ఫంగస్ రోగుల కోసం కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో కొత్తగా పడకలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ సిబ్బంది కొరత తీవ్రంగా వేదిస్తోంది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వార్డు బోయ్స్, నర్సుల కొరత ఉంది. ఇన్ పేషంట్లుగా ఉన్న వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి ఇంజెక్షన్లు, మందులు , ఆక్సీజన్ ఇవ్వవలసి ఉంది. దీంతో ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సులు, వార్డు బోయ్స్ లపై పని భారం పడుతోంది. దీనిని అధిగమించేందుకు గాను సరోజినీ ఆస్పత్రి నుండి 15 మంది నర్సులను డిప్యుటేషన్ పై కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో పని చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. వీరు విధులలో చేరినా రోగుల తాకిడి ఊహించని విధంగా ఉండడం అధికారులను ఆందోళనలకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఒకటి , రెండు రోజులలో ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అంతవరకు ఇబ్బందులు తప్పవని ఆస్పత్రి లో పని చేసే వైద్యులు, సిబ్బందికి పాలక వర్గం సర్ధి చెబుతోంది.

కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి ఆదివారం రోగుల తాకిడి తగ్గగా ఇన్ పేషంట్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఆస్పత్రి అధికారులు అధికారిక వెల్లడించిన ప్రకారం మొత్తం 80 మంది ఓపీ విభాగానికి బ్లాక్ ఫంగస్ రోగులు రాగా వీరిలో 60 మందిని ఇన్ పేషంట్లుగా చేర్చుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 187 కు పెరిగింది. అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం చూస్తే ఆస్పత్రిలో ఇంకా 43 పడకలు (200 పాత పడకలు, 30 అదనంగా ఏర్పాటు చేసినవి)ఖాళీగా ఉన్నాయి. అయితే రోగులకు మంచాలు ఖాళీ లేవని చెప్పి చేర్చుకునేందుకు నిరాకరించడానికి గల కారణాలు వెల్లడించాలని రోగుల సహాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed