- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ భూములపై ‘గులాబీ లీడర్ల’ గురి..!
దిశ, న్యూస్‌బ్యూరో :
అక్కడ గజం భూమి ధర రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతోంది. ప్రధాన రహదారిని ఆనుకొనే ఏడెకరాల ప్రభుత్వ స్థలం ఉంది. దాని విలువ రూ.50 కోట్ల పైమాటే. చుట్టూ సంపన్నవర్గాల భూములే. ఆ పట్టాదారులంతా రాజకీయ పలుకుబడి కలిగినవారే. పైగా అధికార పార్టీకి చెందిన నాయకగణం. ఇంకేముంది.. పొరుగున ఉన్న భూమి తమదేనంటూ ప్రభుత్వ స్థలాన్ని కలిపేసుకున్నారు. పూర్వ కాలం నుంచి అది ముమ్మాటికీ ప్రభుత్వానిదేనని స్థానికులకు తెలుసు. కానీ ఆక్రమాలకు పాల్పడుతోన్న వారి నుంచి భయం పొంచి ఉండడంతో ఎవరూ ఎవరికీ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రానట్టు తెలుస్తోంది. అయితే సోమవారం కొందరు ధైర్యం చేసి ఈ విషయాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్లితే.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్‌పేటలో సర్వే నం.165లో ప్రభుత్వ భూమి 7 ఎకరాలు ఉంది. దానికి సరిహద్దులుగా సర్వే నంబర్లు 161, 162, 166 భూములు ఉన్నాయి. ఆ భూముల యజమానులు తీగల సత్యనారాయణరెడ్డి, తీగల విక్రంరెడ్డిలు సదరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని స్థానికుడైన బండి నాగేశ్ యాదవ్ సోమవారం కలెక్టర్ అమోయ్ కుమార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వాస్తవానికి సర్వే నంబర్ 166లో 2.10 ఎకరాల భూమి మాత్రమే ఉంది.
ఆ భూమితో పాటు సర్వే నంబర్ 165 లోని ప్రభుత్వ భూమిని కూడా కలుపుకొని ప్రహరీని నిర్మించుకున్నట్లు తెలిసింది. గతంలో రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు సర్వే చేసి ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు కూడా ఉన్నాయి. పహణీలు పరిశీలించి విచారణ చేస్తే నిజానిజాలు బయటికొచ్చే అవకాశం ఉన్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబితారెడ్డికి ఉంది. కానీ ఈ దందాలో అధికార పార్టీకి చెందిన వారే ఉండడంతో ఆమె మౌనం వహిస్తున్నారని స్థానికంగా చర్చ నడుస్తోంది.
సర్వే చేస్తే చాలు..
మీర్‌పేటలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడే మార్గం ఉంది. కానీ అధికారులు సదరు భూమిని సర్వే చేసి హద్దు రాళ్లను ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పొరుగునే ఉన్న సంపన్నవర్గాలు, పట్టాదారులే ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇకనైనా రెవెన్యూ అధికారులు సర్వే నంబర్లు 161, 162, 166తోపాటు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 165లోని ఏడెకరాలను కూడా సర్వే చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఏడెకరాల చుట్టూ ప్రహరీ నిర్మించకపోతే రూ.కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం కావడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. సదరు స్థలాన్ని ప్రజాప్రయోజనాల కోసం వినియోగించేలా చూడాలని, కనీసం డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తే వేలాది పేద కుటుంబాలకు సొంతింటి భాగ్యం కలుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా మంత్రి సబితారెడ్డి స్పందించి సర్వేకు అధికారులను ఆదేశించాలని మీర్‌పేటవాసులు కోరుతున్నారు.