డీఎస్పీ అభ్యర్థులపై రూల్స్ ఎఫెక్ట్.. కలవర పెడుతున్న ఆ సమస్య

by Anukaran |   ( Updated:2021-11-14 23:36:08.0  )
డీఎస్పీ అభ్యర్థులపై రూల్స్ ఎఫెక్ట్..  కలవర పెడుతున్న ఆ సమస్య
X

డీఎస్పీ అభ్యర్థులను హైట్​సమస్య వేధిస్తున్నది. దేశంలోని 20 రాష్ట్రాల్లో 165 సెంటీమీటర్ల ఎత్తు చాలని ఉండగా.. తెలంగాణలో మాత్రం పురుషులు 167.6 సెం.మీ, మహిళలు 152 సెం.మీ ఎత్తు తప్పక ఉండాలని నిబంధనలు సూచిస్తున్నాయి. కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు డీఎస్పీ కొలువులకు ఒకటే హైట్​ను నిర్ణయించడాన్ని నిరుద్యోగులు తప్పపడుతున్నారు. డీఎస్పీగా డైరెక్ట్ రిక్రూట్​అయిన వ్యక్తి పదేళ్లలో కన్ఫర్డ్ ఐపీఎస్​ కావడం తథ్యమని, అలాంటి పోస్టుకు కానిస్టేబుల్​ఉద్యోగాలకు సంబంధించిన నిబంధనలు పెట్టడం సరికాదంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్పీ కొలువుల భర్తీ కోసం 2012లో గ్రూప్–1 నోటిఫికేషన్​వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత 92 డీఎస్పీ పోస్టులకు నోటిఫికేషన్​ జారీ కానున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం హాట్​టాపిక్​గా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్​70 నుంచి 80 వేల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఇటీవల ప్రకటించారు. ఇందుకోసం త్వరలోనే గ్రూప్​–1 నోటిఫికేషన్​ విడుదల చేసే చాన్స్ ఉంది. ఇందులో డీఎస్పీ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఎత్తు ప్రతిబంధకంగా మారనుంది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఈ నిబంధనలు ఒకలా ఉంటే.. తెలంగాణలో మరోలా ఉండటమే ఇందుకు కారణం. డీఎస్పీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే పొరుగు రాష్ట్రాల్లో పురుషులకు165 సెంటీమీటర్లు, మహిళలకు 150 సెంటీమీటర్ల ఎత్తుంటే చాలు. తెలంగాణలో మాత్రం పురుషులకు 167.6 సెం,మీ, మహిళలకు 152 సెం.మీ ఎత్తు ఉండాలని తప్పక ఉండాలని నిబంధనలు సూచిస్తున్నాయి.

హైట్​విషయంలో నిబంధనలు మారిస్తే వేల మందికి లబ్ధి చేకూరుతుంది. ఈ విషయంలో మంత్రులు, అధికారులను కలిసినా ఎలాంటి పరిష్కారం దొరకలేదని నిరుద్యోగులు చెబుతున్నారు. త్వరలో నోటిఫికేషన్​వెలువడే అవకాశం ఉండటంతో యువకులు ఆందోళన చెందుతున్నారు. డీఎస్పీ.. ఆఫీసర్​క్యాడర్​రేంజ్​కలిగిన పోస్టు. కానిస్టేబుల్, ఎస్సై ఫీల్డ్ లెవల్​పోస్టు. వీటికి దరఖాస్తు చేసుకోవాలంటే ఉండాల్సిన నిబంధనలే డీఎస్పీ పోస్టులకు కూడా వర్తింపజేస్తుండటంతో ఎంతోమంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. డీఎస్పీగా నియమితులైన వారు ఎనిమిది నుంచి పదేళ్లలో ఐపీఎస్ గా కన్ ఫర్డ్ అయ్యే చాన్స్ ఉంది. ఇందుకోసమైనా నిబంధనలు సవరించాలని నిరుద్యోగులు డిమాండ్​చేస్తున్నారు. కష్టపడి చదివి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై ఉక్కుపాదం మోపడమే కాక, గ్రామీణులకు సేవ చేయాలనే కోరికతో ఉన్న తమకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరిసారిగా గ్రూప్–1 పోస్టులకు నోటిఫికేషన్​వేశారు. ఆ తర్వాత నోటిఫికేషన్​ రాలేదు. ఇటీవల సీఎం కేసీఆర్​ప్రకటనతో కొద్ది రోజుల్లో 92కు పైగా డీఎస్పీ పోస్టులకు నోటిఫికేషన్ వేసే అవకాశం ఉండటంతో నిరుద్యోగులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వీరిని హైట్​నిబంధన వేధిస్తున్నది. ఈ సారి మిస్సియతే మరో ఐదారేండ్ల వరకు ఇంత భారీ మొత్తంలో పోస్టులకు నోటిఫికేషన్​వెలువడే అవకాశమే లేదంటున్నారు. వేసినా నాలుగైదు పోస్టులకు మించి ఉండవని చెబుతున్నారు. ఇప్పుడే ఎత్తు నిబంధనలు సవరించాలని ప్రభుత్వాన్ని యువకులు కోరుతున్నారు.

రాష్ట్రంలో అసిస్టెంట్ కన్జర్వేటర్​ఆఫ్ ఫారెస్ట్(ఏసీఎఫ్) పోస్టుకు ఉండాల్సిన ఎత్తు 163 సెం.మీగా నిర్ణయించారు. ఇదే క్రమంలో డీఎస్పీ పోస్టుకు 165 సెం.మీలకు తగ్గించి సవరణలు చేస్తే తప్పేంటని వారు ప్రశ్నిస్తున్నారు. షెడ్యూల్డ్​ట్రైబ్స్​లో కూడా నాలుగైదు తెగలకు ఎత్తు విషయంలో మినహాయింపు ఇస్తున్న ప్రభుత్వం అన్ని వర్గాలకు దీనిని వర్తింపజేయాలని కోరుతున్నారు. దీనిపై 2019లో నిరుద్యోగులు హోంమంత్రి మహమూద్ అలీని కలిసి వినతిపత్రం సమర్పించినా ఫలితం దక్కలేదు. అప్పటి హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, హోం సెక్రటరీ రవిగుప్త సైతం పరిశీలించాలని డీజీపీకి సూచించినా నేటికీ స్పష్టత రాలేదని వాపోతున్నారు. ఇది పాలసీ డెసిషన్ అయినందున రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెప్పారని యువకులు అంటున్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, మంత్రులు హరీశ్​రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యను కలిసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. మంత్రి కేటీఆర్​కు ట్వీట్లు చేసినా ఆయన స్పందించడం లేదని వాపోతున్నారు.

చాలా రాష్ట్రాల్లో 165 సెంటీమీటర్లే..

ఉగ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జమ్ము, కశ్మీర్ లో సైతం డీఎస్పీ పోస్టుకు 165 సెం.మీ లుగా ఉంది. అలాంటిది తెలంగాణలో ఎందుకు తగ్గించరు. నక్సల్స్​ప్రాబల్యం అధికంగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లోనూ 165 సెంమీ. ఎత్తు నిబంధనగా ఉంది. దేశంలోని అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, ఉత్తర ప్రదేశ్​, జమ్ము, కశ్మీర్​, మేఘాలయ, మిజోరం, అరుణాచల్​ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లోనూ 165 సెంమీల ప్రాతిపదకన భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే విధానాన్ని అమలు చేసి పోస్టులు భర్తీ చేయాలి.

= చందు, నిరుద్యోగి, బీహెచ్ఈఎల్.

నిరుద్యోగులపై ఎందుకీ వివక్ష

పోలీస్​డిపార్ట్ మెంట్లో పనిచేయాలనేది నా కల. అందుకే గ్రూప్​1కు ప్రిపేర్​అవుతున్నా. గ్రామీణుల జీవితాలను బాగుచేయడం లక్ష్యంగా పెట్టుకున్నా. యూపీఎస్సీలో కూడా ఎత్తు 165 సెం.మీ ఉంది. తెలంగాణలో డీఎస్పీ పోస్టులకు మాత్రం ఎందుకు 167.6 సెంమీ ఎందుకు? మనకున్న రాజ్యాంగం ఒక్కటే కదా. నా హైట్​166 సెంమీ ఉంది. దీనివల్ల రెండుసార్లు దరఖాస్తు చేసుకోలేకపోయా. ప్రభుత్వం ఎత్తు నిబంధనలు సవరిస్తే నాలాంటి చాలా మందికి అడ్వంటేజ్ అవుతుంది.

= రాజుకుమార్, నిర్మల్

Advertisement

Next Story

Most Viewed