రుచి సోయా నికర లాభంలో 13 శాతం క్షీణత!

by Harish |
రుచి సోయా నికర లాభంలో 13 శాతం క్షీణత!
X

దిశ, వెబ్‌డెస్క్: పతంజలి గ్రూప్ సంస్థ రుచి సోయా 2020-21 (Ruchi Soya) ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 13 శాతం క్షీణించి రూ. 12.25 కోట్లకు చేరుకుందని, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఆచార్య బాలకృష్ణ రాజీనామా చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 14.01 కోట్లుగా నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 3,057.15 కోట్లకు పడిపోయిందని, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 3,125.65 కోట్లుగా ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఆచార్య బాలకృష్ణ ఇతర బాధ్యతల కారణంగా ఆగష్టు 18న రుచి సోయా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను డైరెక్టర్ల బోర్డు అంగీకరించిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. బాలకృష్ణను నాన్-ఎగ్జిక్యూటివ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉండనున్నారు. సంస్థ సభ్యుల ఆమోదానికి లోబడి, ఆగష్టు 19 నుంచి పదవీ విరమణ చేశారు. కాగా, బోర్డు ఛైర్మన్‌గా ఆయన కొనసాగనున్నారని కంపెనీ తెలిపింది. కంపెనీ పూర్తి కాల డైరెక్టర్‌గా ఉన్న రామ్ భరత్… ఆగష్టు 19 నుంచి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. పతంజలి గ్రూప్ (patanjali group) దివాలా ప్రక్రియలో భాగంగా రుచి సోయాను కోనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story