వైద్య ఆరోగ్య శాఖకు రూ. 6,295 కోట్లు

by Shyam |
వైద్య ఆరోగ్య శాఖకు రూ. 6,295 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైద్యారోగ్య శాఖ కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6,295 కోట్లను కేటాయించింది. ఆరోగ్యలక్ష్మి పథకం కోసం రూ.20కోట్లను కేటాయిస్తున్నట్టుగా మంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.136.44 కోట్లు వెచ్చించి నాలుగు లక్షల మంది గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్టు వివరించారు. కేసీఆర్ కిట్‌ను ఇప్పటి వరకు 8,71,340 మందికి అందించినట్లు చెప్పారు. ప్రసూతి మరణాలు 2013-14లో లక్ష మందికి 92 ఉంటే, కేసీఆర్ కిట్ పథకం అమలుతో ప్రస్తుతం 63కు తగ్గిందని వివరించారు. శిశు మరణాల రేటు 39 నుంచి 26కు తగ్గిందని చెప్పారు.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1,200 కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రతి పది లక్షల జనాభాలో రెండు లక్షల 11 వేల జనాభాకు టెస్టులు నిర్వహించిందని పేర్కొన్నారు. ఐసోలేషన్ సెంటర్లు మందులు, బెడ్లు, ఆహారం తదితర అవసరాల కోసం రూ.1,178.28 కోట్ల ఖర్చు చేశామని చెప్పారు. పేద ప్రజల కోసం ప్రత్యేకంగా 25 డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటయ్యాయని తెలిపారు.

నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందేందుకు ఇప్పటి వరకు 224 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి, 196 రకాల మందులు, 56 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. మహిళా ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీల్లో టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 కోట్లను కేటాయించింది.

Advertisement

Next Story