సిద్దిపేట ఐలాండ్‌కు పర్యాటక సొబగులు.. రూ.110 కోట్లతో ఫినిషింగ్ టచ్

by Shyam |   ( Updated:2021-04-15 09:18:51.0  )
సిద్దిపేట ఐలాండ్‌కు పర్యాటక సొబగులు.. రూ.110 కోట్లతో ఫినిషింగ్ టచ్
X

దిశ, సిద్దిపేట : సిద్దిపేట ప్రాంతంలో నిర్మితమైన రంగనాయక సాగర్ పర్యాటక అభివృద్ధికి రూ.110 కోట్లు మంజూరైనట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట దక్షిణాన కోమటి చెరువు గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్నదని అంతకంటే గొప్ప పర్యటక ప్రాంతంగా, రాష్ట్రానికే తలమానికంగా నిలిచేలా పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల సీఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటన సందర్భంగా రంగనాయక సాగర్‌ను సందర్శించారని, అదే రోజు రంగాయక సాగర్ గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లెలా తీర్చిదిద్దాలన్నారు. అందుకు రూ.110 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం హామీ మేరకు గురువారం నిధులకు విడుదల కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయని చెప్పారు. ఈ నిధుల విడుదలతో రంగనాయక సాగర్ ఐలాండ్ గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పుకొచ్చారు.

రంగనాయక సాగర్‌లో గోదావరి పరవళ్లు..

వాన కురిస్తేనే చెరువు నిండాలి. చెరువు నిండితేనే పంట పండాలి. ఒకప్పుడు సిద్దిపేట ప్రాంత పరిస్థితి ఇది. కానీ, తెలంగాణ ప్రభుత్వంలో తొలి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు కృషితో సిద్దిపేట స్వరూపమే మారిపోయింది. మిషన్‌ కాకతీయతో చెరువులను అభివృద్ది చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తెచ్చి రంగానాయకసాగర్‌లో ఎత్తిపోసేలా చేశారు. ఆ నీటిని ఊరూరా చెరువుల్లో నింపారు. సాగునీటి కష్టాలు తీర్చారు. వట్టిపోయిన బీడు భూములను పచ్చని మాగాణిలా మార్చారు. సిద్దిపేట పట్టణానికి సమీపంలోనే 3 టీఎంసీల సామర్థ్యం కలిగిన రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ను నిర్మించారు. గోదావరి జలాలతో ఈ రిజర్వాయర్‌ నిరంతరం కళకళలాడుతూనే ఉన్నది. సాగునీటి కష్టాలు తీర్చడంతో పాటుగా పర్యాటక ప్రేమికులను ఆకట్టుకుంటున్నది. రిజర్వాయర్‌ నడిమధ్యలోని పల్లగుట్టపై నిర్మించిన గెస్ట్‌హౌస్‌ అబ్బుర పరుస్తున్నది. గుట్ట చుట్టూ రహదారులను తీర్చిదిద్దారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈ రిజర్వాయర్‌ను సందర్శించి రూ.110 కోట్లు పర్యాటక అభివృద్ధి కోసం ప్రకటించారు. ఒక అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రదేశంగా మారనున్న రంగనాయకసాగర్‌ సిద్దిపేట ప్రజలకు గొప్ప వరమే.

Advertisement

Next Story