కోదాడలో ఓ నాయకుడి లీలలు.. రూ.1.30 కోట్లకు శఠగోపం

by Sumithra |
Rs 1.30 crore fraud in Kodada
X

దిశ, కోదాడ: పేపర్ ప్లేట్స్ మిషనరీని ఇస్తానని ఓ వ్యక్తి దంపతుల జంట నుంచి కోటిన్నర దండుకున్నాడు. ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బును కాజేసి తిరుగుతున్న అతగాడిని పోలీసులు పట్టుకున్నారు. కోదాడలో జరిగిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను పట్టణ సీఐ నరసింహారావు విలేకరులకు వెల్లడించారు.

కోదాడ పట్టణానికి చెందిన ఓర్సు వెల్లంగి రాజు అనంతగిరి రోడ్డులోని నయానగర్‌లో సుజిత్ ఇండస్ట్రీ ఇన్ ఫోర్ ఎక్స్పోర్ట్ కంపెనీని నెలకొల్పాడు. దీని ద్వారా క్యారీ బ్యాగులు, పేపర్ ప్లేట్స్ తయారు చేసే మిషన్లను చైనా నుండి దిగుమతి చేసుకుని విక్రయిస్తానని చాలా మంది వద్ద డబ్బులు వసూలు చేశాడు. ఆ కంపెనీపై కోదాడలోని ఇండియన్ బ్యాంకులో అకౌంటు ఓపెన్ చేశాడు. దీని గురించి తెలుసుకున్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామానికి చెందిన భార్యభర్తలైన కూర్పుల వెంకట తిరుమల, కృష్ణ పాండురంగ ప్రసాదరావు అందమైన పేపర్ ప్లేట్స్ తయారు చేసే మిషన్ కావాలని కోరుతూ వెల్లంగి రాజును సంప్రదించారు. వారు అడిగిన మిషన్‌కు కోటిన్నర వరకు ఖర్చవుతుందని తెలిపాడు.

అయితే అంత డబ్బు తమ వద్ద లేదని వారు చెప్పడంతో లోన్ తీసుకోవాలని వెల్లంగి రాజు సలహా ఇచ్చాడు.బ్యాంకర్స్‌తో తానే రుణం ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో ఆ దంపతులు కోదాడ పట్టణంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావుకు లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆదిత్య పేరుతో మందమైన పేపర్ ప్లేట్స్ తయారు చేసే కంపెనీ స్థాపిస్తున్నామని, తమ ఆస్తులను తాకట్టు పెట్టుకొని అప్పు ఇవ్వాలని కోరారు. అలా ఆ బ్యాంకులో రూ.1.30 కోట్లను అప్పుగా తీసుకున్నారు.

బ్యాంక్ లోన్ ద్వారా వచ్చిన కోటి 30 లక్షలను వెల్లంగి రాజు చేతిలో పోశారు. మూడు నెలలు గడిచినా పేపర్ ప్లేట్స్ మిషన్ ఇవ్వలేదు. దీనిపై బాధితులు ప్రశ్నించినా.. అప్పుడు, ఇప్పుడు అంటూ దాటవేస్తున్నాడు. ఈ క్రమంలో లోన్ ఇచ్చిన బ్యాంక్ అధికారులు కంపెనీ పరిశీలన కోసం వస్తున్నట్లు పేర్కొనడంతో విషయం వెలుగు చూసింది. ఒకవైపు మిషన్ రాకపోవడం.. మరోవైపు బ్యాంక్ అధికారుల ప్రశ్నలతో విసుగుచెందిన దంపతులు కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో వెల్లంగి రాజు తమల్ని మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు పట్టణ సీఐ నరసింహారావు తెలిపారు.

కాగా వెల్లంగి రాజుపై గతంలో కూడా చీటింగ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పట్టణంలోని ఓపెన్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయిస్తానని కొందరి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేయడంతో కేసు నమోదు అయినట్లు పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. రాజు తాను ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర నాయకుడిని అని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed