వైఎస్ జగన్‌కు రోజా సర్‌ప్రైజ్ బర్త్‌ డే గిఫ్ట్

by srinivas |
roja and jagan
X

దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా రాజకీయాల్లో ఏం చేసినా ఆమెకంటూ ఒక సెపరేట్ రూటు ఉంటుంది. వైసీపీ ఆవిర్భావం నుంచి రోజా వైఎస్ జగన్ వెన్నంటి నడిచారు. అంతేకాదు ఎన్నో అవమానాలు సైతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నగరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోజా..అన్నింటిలోనూ ప్రత్యేకత చాటుతుంటారు. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడతారు. సీఎం వైఎస్ జగన్‌ను ఇతర పార్టీలు విమర్శిస్తే ముందుగా స్పందించేది రోజాయే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సీఎం జగన్ సైతం ఎన్నికల ప్రచారంలో రోజా తన చెల్లి అంటూ ప్రజలకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా వైఎస్ జగన్‌పై పలు సందర్భాల్లో తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాదు అసెంబ్లీలోనూ… బయట సభల్లోనూ జగన్ పై పొగడ్తలు కురిపిస్తూ తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్యే రోజా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ ఉన్నారు. గత జన్మదినం నాడు రోజా ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమె విద్యకు అవసరమయ్యే అన్నింటిని ఆమె భరిస్తున్నారు.

అయితే ఈ ఏడాది కూడా అంతే ప్రత్యేకతను చాటుకునేలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగన్ బర్త్ డే సందర్భంగా తన నియోజకవర్గంలో సంబరాలు నిర్వహిస్తూనే అందరికీ గుర్తిండిపోయేలా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా తన నియోజకవర్గంలోని మీరాసాబ్ పాలెంను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మీరాసాబ్ పాలెం గ్రామంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదని.. అందుకే ఈ ఊరిని దత్తత తీసుకున్నారు. 2023 డిసెంబర్ 21(వచ్చే జగన్ బర్త్ డే) లోపు మీరాసాబ్ పాలెంను మోడల్ విలేజ్‌గా మార్చి బహుమతిగా ఇవ్వాలని రోజా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యే రోజా తీసుకున్న నిర్ణయాన్ని సోషల్ మీడియాలో చాలా మంది అభినందనలతో ముంచెత్తుతున్నారు.

అన్నంత పని చేసిన అసమ్మతి వర్గం

ఇదిలా ఉంటే జగన్ పుట్టినరోజు నాడు కూడా ఎమ్మెల్యే రోజాకు అసమ్మతి సెగ తగ్గలేదు. ఫైర్‌బ్రాండ్‌కు అసమ్మతి వర్గం గట్టిషాకే ఇచ్చింది. నగరంలో రోజాకు ధీటుగా సీఎం జగన్ బర్త్ డే వేడుకలను నిర్వహించింది. అంతేకాదు నగరిలో ఎక్కడ చూసినా రోజా ఫోటో లేకుండానే ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. సీఎం జన్మదినం సందర్భంగా నగరి నియోజకవర్గంలోని ఏకాంబర కుప్పం నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులతో రోజా భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా ఉన్న బ్యానర్లలో రోజా ఫోటో లేని బ్యానర్లే దర్శనం మిచ్చాయి. ఎమ్మెల్యే రోజా ఫొటోలేని బ్యానర్‌లు చూసిన ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

‌నగరిలోని నాలుగు మండలాల ముఖ్య నేతలు రోజా లేకుండానే పుత్తూరులో సీఎం పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఒకే పార్టీకి చెందిన నాయకులు ఒకే నియోజకవర్గంలో రెండు ప్రాంతాల్లో జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతర్గతంగా ఎన్ని గొడవలు ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో కలిసి మెలసి ఉండాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అయితే తాజా పరిణామాలను రోజా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. జగనన్న తనకు అండగా ఉన్నంత కాలం తనను ఎవరూ ఏమీ చేయలేరని రోజా బల్లగుద్ది చెబుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం. నగరి ప్రజల ఆశీర్వాదం, సీఎం జగన్ అండ తనకే ఉన్నాయని.. అసమ్మతి నేతలు ఎన్ని కుట్రలు చేసినా తనకేం కాదంటూ రోజా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed