పోలీసులే చంపేశారు… ఆర్కే భార్య శిరీష సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2021-10-15 07:36:36.0  )
పోలీసులే చంపేశారు… ఆర్కే భార్య శిరీష సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతిపై ఆయన భార్య శిరీష సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తది సహజ మరణం కాదని ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. అనారోగ్యం పాలైన తన భర్తకు వైద్యం అందించకుండా పోలీస్ శాఖ ప్రయత్నించిందని ధ్వజమెత్తారు. అడవి చుట్టూ పోలీసులు చుట్టుముట్టి వైద్యం అందకుండా చేసి చంపేశారని శిరీష ఆరోపించింది. అంతేకాకుండా మావోయిస్టులకు సహకరించకుండా గిరిజనులను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. అలాగే మావోయిస్టులకు చేరే ఆహారంలో విషం కలుపుతున్నారంటూ శిరీష ఆరోపించారు. తన భర్త ఆర్కే చనిపోలేదని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. అణగారిన వర్గాలు..బడుగు బలహీన వర్గాల వారి కోసం తన భర్త అమరుడయ్యారన్నారు. ప్రజల కోసం పోరాడతాం…ప్రజల కోసం చస్తాం అంటూ సాగిన పోరాటంలో తన కుమారుడిని కూడా పోగొట్టుకున్నామని..ఇప్పుడు ఆర్కేను కూడా కోల్పోయామని శిరీష కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్కే ప్రజల కోసం పోరాడి గొప్ప యోధుడనీ.. అతని ఆశయాలను కొనసాగిస్తామనీ తెలిపారు. ఆర్కేకు జోహార్లు పలికారు. అర్కే అమర్ రహే అంటూ కన్నీటితో నినాదాలు చేశారు. ప్రజల కోసం జీవించిన మనిషికి.. వీరుల మధ్య అంత్యక్రియలు జరిగాయని శిరీష తెలిపారు.

కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో చనిపోయారు: మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతిని మావోయిస్టు పార్టీ ధృవీకరించింది. ఈ నెల 14న ఉదయం చనిపోయినట్టు మావోయిస్టు అధికార ప్రతినిది అభయ్ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కిడ్నీలు ఫెయిల్ అవడంతో చనిపోయినట్టు ప్రకటనలో వెల్లడించారు. చికిత్స చేసినా ఆర్కేను కాపాడులేకపోయామని ప్రకటించారు. విప్లవ శ్రేణుల మధ్యే అంత్యక్రియలు జరిగినట్టు పార్టీ స్పష్టం చేసింది. ఆర్కే మరణ వార్త విని.. ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు ఆర్కే భార్య శిరీష.

Advertisement

Next Story