- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం.. 200 మందికి అస్వస్థత
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీసి రోడ్లపై ప్రజలు, పశువులు, ప్రాణమున్న జీవులన్నీ పడిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
విశాఖపట్టణంలోని గోపాలపట్నం దగ్గర్లోని ఆర్ఆర్ వెంకటాపురంలో కొరియన్ కంపెనీ ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ ఉంది. సుదీర్ఘ కాలంగా ఈ పరిశ్రమ నడుస్తోంది. ప్రమాదవశాత్తూ కంపెనీలోంచి హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి సంబంధించిన స్టీరెయిన్ గ్యాస్ నేటి ఉదయం నాలుగు గంటల సమయంలో లీకైంది. ఇది దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఆ వాసనకు కడుపులో వికారం, కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు.
ఆర్ఆర్ వెంకటాపురంలోని చాలా మంది ఇళ్లలో తలుపులు వేసుకుని ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేయగా, పలువురు ఇళ్లలోంచి ప్రాణ భయంతో పరుగులు తీశారు. గ్యాస్ తీవ్రతకు తాళలేక రోడ్లపై పడిపోయారు. పలువురు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఘటన గురించి తెలియగానే పోలీసులు సైరన్ మోగిస్తూ ఆ పరిసరాలకు చేరుకున్నారు. వేగంగా ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరిస్తూ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని 25 అంబులెన్స్‌లు పిలిపించారు.
గ్యాస్ తీవ్రతకు పశు, పక్ష్యాదులతో పాటు 8 మంది మృతి చెందారు. ఆ పరిసరాల్లోని పచ్చని చెట్లకు ఉన్న మామిడి, అరటి వంటి పంటలతో పాటు కొన్ని చెట్లు మాడిపోయాయి. ఈ సమయంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న మరికొందరు అలాగే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సుమారు 200 మందిని కేజీహెచ్‌తో పాటు ఇతర ఆస్పత్రులకు తరలించి, చికిత్స నందిస్తున్నారు.
దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వేగంగా స్పందించి, టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మీనా, కమిషనర్ ఆర్కే మీనాతో సీఎం మాట్లాడారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టారు. ఇళ్లలోఎవరైనా చిక్కుకుపోయారా? అన్న వివరాలు ఆరాతీస్తున్నారు. స్థానికులతో పాటు ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలికి చేరుకుని రక్షణ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.
దీనిపై విపక్షాల నేతలు స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్థానికులను రక్షించేందుకు టీడీపీ శ్రేణులు కదలాలని బాబు పిలుపునిచ్చారు. మరోవైపు జనసేన నేతలు కూడా స్థానిక నేతలకు సహాయక చర్యల కోసం పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో విశాఖపట్టణం చేరుకోనున్నారు. నేరుగా కేజీహెచ్‌కు వెళ్లి బాధితులను కలవనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తరువాత ఎల్జీ పాలిమర్స్ పరిసరాలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
Tags: lg palimers accident, visakhapatanam, gopalapatnam, rr venkatapuram, megadhrigedda, cemical compeney gas leak