రిలయన్స్ రైట్స్ ఇష్యూకు వాయిదాల్లో చెల్లింపులు!

by Harish |
రిలయన్స్ రైట్స్ ఇష్యూకు వాయిదాల్లో చెల్లింపులు!
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇదివరకు ప్రకటించిన రూ. 53,125 కోట్ల విలువైన రైట్స్ ఇష్యూకు దరఖాస్తు చేసుకోవడానికి వాటాదార్లు 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. మిగిలిన మొత్తాన్ని వచ్చే సంవత్సరంలో మే, నవంబర్‌లలో రెండు వాయిదాల్లో చెల్లించవచ్చని రిలయన్స్ కంపెనీ పేర్కొంది. వాటాదార్ల సబ్‌స్క్రిప్షన్ బుధవారం(మే 20న) మొదలవుతున్న రైట్స్ ఇష్యూ జూన్ 3తో ముగుస్తుంది. కంపెనీ ప్రతి 15 షేర్లకు ఒక షేర్ రూ. 1,257 ధరతో ఆఫర్ చేస్తోంది. దరఖాస్తు చేసే సమయానికి 25 శాతం అంటే ఒక్క షేర్‌కు రూ. 314.25 చెల్లిస్తే చాలు. మరో 25 శాతం 2021 మేలోనూ, మిగిలిన 50 శాతం అంటే రూ. 628.50 ని 2021 నవంబర్‌లో చెల్లించవచ్చని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో రిలయన్స్ సంస్థ స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని ఈ నెల 17న జరిగిన బోర్డ్ డైరెక్టర్ల రైట్స్ ఇష్యూ కమిటీ ఖరారు చేసినట్టు సంస్థ వెల్లడించింది.

మూడు దశాబ్దాల తర్వాత..

మూడు దశాబ్దాల కాలంలో తొలిసారిగా రిలయన్స్ ఇండస్ట్రీ రైట్స్ ఇష్యూకు వస్తోంది. అంతేకాకుండా దేశంలోనే అతిపెద్ద రైట్స్ ఇష్యూ ఇదే కావడం గమనార్హం. సాధారణంగా కంపెనీలు నగదు లభ్యత కోసం రైట్స్ ఇష్యూకు వస్తాయి. అయితే, రిలయన్స్ సంస్థ వద్ద ప్రస్తుతం రూ. 1.77 లక్షల కోట్ల నగదు నిల్వలున్నప్పటికీ 2021 నాటికి సంస్థను రుణ రహిత సంస్థగా మార్చాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇంతకుముందు 1991లో కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేయడంతో ప్రజల నుంచి కంపెనీ నిధులను సమీకరించింది.

Advertisement

Next Story