రిలయన్స్ ఇండస్ట్రీ లాభాలు రూ. 12,273 కోట్లు

by Harish |
రిలయన్స్ ఇండస్ట్రీ లాభాలు రూ. 12,273 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్(ఆర్ఐఎల్) 2020-21లో జూన్ త్రైమాసికంలో రూ. 12,273 కోట్ల నికర లాభాలను వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ సాధించిన రూ. 13,233 కోట్లతో పోలిస్తే ఈ సారి 7.25 శాతం క్షీణించాయి. సమీక్షించిన త్రైమాసికంలో ఆయిల్-టు-టెలికాం కంపెనీ కార్యకాలాపాల ఆదాయం 58.2 శాతం పెరిగి రూ. 1.44 లక్షల కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. వార్షిక పరంగా సంస్థ పనితీరు మెరుగ్గా ఉన్నప్పటికీ, సెకెండ్ వేవ్ ప్రభావం కారణంగా త్రైమాసిక పరంగా దెబ్బతిన్నదని కంపెనీ అభిప్రాయపడింది.

సంస్థ టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్ జూన్ త్రైమాసికంలో 45 శాతం వృద్ధితో రూ. 3,651 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. ఆదాయం 4 శాతం పెరిగి రూ. 18.952 కోట్లకు చేరుకుంది. అలాగే, ఈ త్రైమాసికంలో కొత్తగా 1.4 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు చేరారని తెలిపింది. రిటైల్ విభాగం నికర లాభం రెట్టింపు పెరిగి రూ. 962 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం 19 శాతం పెరిగి రూ. 33,566 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 80 శాతం పెరిగి రూ. 1,941 కోట్లుగా ఉంది.

ఈ కాలంలో రిలయన్స్ రిటైల్ 123 కొత్త స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం వాటి సంఖ్య 12,803కు చేరుకుంది. జూన్ తొలి త్రైమాసికంలో ఆయిల్-టూ-కెమికల్ వ్యాపారం మెరుగైన ఫలితాలను వెల్లడించింది. కార్యకలాపాల ఆదాయం 75.2 శాతం పెరిగి రూ. 1.03 లక్షల కోట్లకు చేరుకుంది. చమురు-గ్యాస్ వ్యాపరం కూడా మెరుగ్గా ఉంది. కరోనా సెకెండ్ వేవ్ సవాళ్లు ఉన్నప్పటికీ ఈ విభాగం ఆదాయం 153.2 శాతం పెరిగి రూ. 1,281 కోట్లకు చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed