కేజీ డీ6 నుంచి సహజ వాయువు ఉత్పత్తి ప్రారంభం

by Harish |   ( Updated:2020-12-18 09:16:16.0  )
కేజీ డీ6 నుంచి సహజ వాయువు ఉత్పత్తి ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాలోనే లోతైన గ్యాస్ బావి నుంచి సహజ వాయువును శుక్రవారం నుంచి వెలికి తీస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ(బ్రిటీష్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ)లు ప్రకటించాయి. కేజీ డీ6 బ్లాక్‌లో ఈ గ్యాస్‌ను వెలికి తీయనున్నట్టు, దీని ద్వారా 2023 నాటికి భారత్‌కు అవసరమైన గ్యాస్‌లో 15 శాతం అందించగలదని చెప్పాయి. దేశీయ ఉత్పత్తిలో ఇది 25 శాతం ఉంటుందని ఇరు కంపెనీలు వెల్లడించాయి. అంతేకాకుండా భారత్‌కు సహజవాయువు దిగుమతుల భారం తగ్గుతుందని తెలిపాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ కంపెనీలు కలిసి కృష్ణా– గోదావరి బేసిన్‌‌లోని కేజీ డీ6లో ఆర్ క్లస్టర్, శాటిలైట్ క్లస్టర్, ఎంజే డీప్ వాటర్ గ్యాస్ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తున్నాయి.

కేజీ డీ6 బ్లాక్‌లో ఇదివరకే హబ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లను ఉపయోగించుకోనున్నాయి. కేజీ డీ6లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 66.67 శాతం, బీపీ 33.33 శాతం పార్టిసిపెంట్ ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాయి. ఆర్ క్లస్టర్ ఫీల్డ్ ప్రస్తుతం కాకినాడ తీరంలో ఉన్న కేజీ డీ6 కంట్రోల్, రైజర్ ప్లాట్‌ఫామ్‌కు 60 కి.మీ దూరంలో ఉంది. అలాగే, ఈ గ్యాస్ ఫీల్డ్ సముద్ర గర్భంలో సుమారు 2000 మీటర్ల లోతున ఉంది. ఈ ఫీల్డ్ నుంచి 2021 నాటికి 1.29 కోట్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు అంచనా. ‘ కృష్ణా-గోదావారి బేసిన్‌లో లోతైన నీటి మౌలిక సదుపాయాల ద్వారా సహజ వాయువును ఉత్పత్తి చేయాలని, తద్వారా దేశంలో పెరుగుతున్న స్వచ్ఛమైన ఇంధన అవసరాలను తీర్చాలని భావిస్తున్నాం’ అని రిలయన్స్ ఇండస్ట్రీ ఛైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed