RV400 ఎలక్ట్రిక్ బైకుల డెలివరీలు ప్రారంభించిన రివోల్ట్!

by Harish |
Revolt Motors
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ రివొల్ట్ మోటార్స్ వినియోగదారులకు తన కొత్త ఎలక్ట్రిక్ బైకుల డెలివరీ ప్రారంభించినట్టు ఆదివారం వెల్లడించింది. ఇటీవల కంపెనీ తన ఆర్‌వీ400 బైకుల కోసం మొదలుపెట్టిన బుకింగ్‌లకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక స్పందన వచ్చిందని, వారందరికీ బైకులను పంపించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. బుకింగ్ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే భారీగా విక్రయాలు నమోదవడంతో బుకింగ్‌లను కంపెనీ నిలిపేసింది. ఫ్లాగ్‌షిప్ విభాగంలో తీసుకొచ్చిన బైక్ ఆర్‌వీ400 కోసం కంపెనీ కార్యాలయాలు కలిగిన నగరాల నుంచి కొనేందుకు భారీ డిమాండ్ ఏర్పడిందని వివరించింది. దేశీయ నగరాలైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, పూణె అహ్మదాబాద్‌లలో కంపెనీ కార్యాలయాలను కలిగి ఉంది.

‘రివొల్ట్ బైకుల కోసం బుకింగ్ పూర్తయిన రోజుల వ్యవధిలోనే డెలివరీలకు పంపిస్తున్నాం. తక్కువ సమయంలోనే వినియోగదారులకు అందించడంపై కంపెనీ దృష్టి పెట్టినట్టు’ రివొల్ట్‌లో పెట్టుబడులు ఉన్న రతన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ బిజినెస్ ఛైర్మన్ అంజలి రతన్ అన్నారు. ఆర్‌వీ400 బైక్ 3.24 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇది 72 ఓల్టుల శక్తిని అందిస్తుందని, ఒకసారి ఛర్జ్ చేసిన తర్వాత 150 కిలోమీటర్ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే, గంటకు 85 కిలోమీటర్ వేగంతో ఇది ప్రయాణిస్తుందని పేర్కొంది.

Advertisement

Next Story