కేసీఆర్ రెండోదఫా రెండేళ్ల పాలన హిట్టా ఫట్టా !

by Anukaran |
కేసీఆర్ రెండోదఫా రెండేళ్ల పాలన హిట్టా ఫట్టా !
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ రెండోసారి సీఎం అయి నిన్నటికి రెండేళ్లు. తొలి దఫాలో ఉద్యమ ఆకాంక్షలకు ప్రిఫరెన్స్ ఇచ్చిన కేసీఆర్.. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు పోయి 88సీట్లతో బంపర్ మెజార్టీ కొట్టారు. తొలి ఏడాది మొత్తం ఎన్నికలే జరగ్గా, నెక్స్ట్ ఇయర్ మొత్తం కరోనా నామ సంవత్సరంగానే ముద్రపడింది. అయితే ఫస్ట్‌ టైం చేయలేని పనులను సెకండ్‌ టైమ్ చేస్తానని ప్రామిస్ చేసిన సీఎం.. రెండేళ్లలో ఆ హామీలు నెరవేర్చారా? కొత్తగా ఏ పథకాలు రూపుదిద్దుకున్నాయి ? ఏయే పనులు నిలిచిపోయాయి ? ఆరేళ్ల కేసీఆర్ పాలనలో ఉద్యమ ఆంకాక్షలు నెరవేరాయా! అలాగే మిగిలిపోయాయా! అసలు రెండోదఫా రెండేళ్ల కేసీఆర్ పాలన హిట్టా, ఫట్టా? లెట్స్ గో..!

2014, జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. మిషన్‌ కాకతీయ, భగీరథ, ఆసరా పెన్షన్లు, కేసీఆర్‌ కిట్, రైతుబంధు, రైతుబీమా పథకాలతో ప్రజలకు దగ్గరై, వారికి పార్టీని దగ్గర చేశారు. రైతుబంధును ఐక్యరాజ్యసమితి సైతం అప్రిషియేట్ చేయగా, మిషన్‌ కాకతీయ పథకాన్ని దేశం మొత్తం మెచ్చుకుంది. సరికొత్త పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ పాలన గాడిలో పడుతుందన్న క్రమంలోనే ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో సంచలననానికి తెరలేపి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్‌ కిట్‌ లాంటి ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులైన గ్రామీణ ప్రాంత ప్రజలు అదే రేంజ్‌లో ఆశీర్వదించి 88సీట్లు కట్టబెట్టగా.. 2018, డిసెంబర్ 13న తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత.. తొలి ఏడాదంతా సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగ్గా, రెండో ఏడాది మొత్తం కరోనా నామ సంవత్సరంగానే మిగిలిపోయింది. లాక్‌డౌన్‌తో‌‌ ఆర్థిక వ్యవస్థ కుంగిపోయి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో సైతం కోతలు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగడంతో కొత్త పథకాలు ప్రారంభం కాలేదు. ఉన్న పథకాల నిధులకే ఎసరు పెట్టాల్సిన పరిస్థితులను తెచ్చిపెట్టాయి. ఇదేక్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల రిజల్ట్‌తో షాకైన కేసీఆర్ వెంటనే ఢిల్లీ పర్యటన చేపట్టి రాష్ట్రానికి రావల్సిన నిధులు, అడిగి చేయించుకోవాల్సిన పనులపై కేంద్రమంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై తిరిగి పట్నం చేరిన కొన్నిగంటల్లోనే కీలక ప్రటకన వెలువడటం గమనార్హం.

మొదటి దఫాలో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలను ఇప్పటికీ భర్తీ చేస్తున్న కేసీఆర్.. రెండోసారి సీఎంగా ప్రమాణం చేసిన రోజే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. అన్నిశాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు సేకరించి వెంటనే 50వేల ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎస్‌ను ఆదేశించడం రెండో దఫా ప్రభుత్వంలో కీలక ప్రకటన. అయితే టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇప్పటివరకు 35వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయని అధికారిక ప్రకటన చేస్తున్నా.. ఈ ఉద్యోగాలకే ఇన్నిరోజుల సమయం పడితే, మరి ఇప్పుడు ప్రకటించిన 50వేల ఉద్యోగాల భర్తీని 2023 ఎలక్షన్ల టైంవరకు తీసుకెళ్తారని విపక్షాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అయితే త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్టంట్‌లో భాగంగానే కేసీఆర్‌ యువతకు ఎత్తుగడ వేస్తున్నారన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఏదిఏమైనాప్పటికీ తొలి నాలుగున్నర ఏళ్ల పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినా, రెండోదఫా రెండేళ్ల పాలనలో మాత్రం రైతులు, యువత తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్పొచ్చు. నిరుద్యోగ భృతిపై హామీ ఇవ్వకపోవడం, గ్రామస్థాయిలో రైతుల వడ్ల కొనుగోళ్లలో ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్న విమర్శలే ఈ రెండేళ్లలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతపాలనతో పోల్చుకుంటే, ఈ రెండేళ్లలో మాత్రం కేసీఆర్‌ మార్క్ పాలన సాగలేదన్నది సాధారణ ప్రజల నుంచి వినపడటం గమనార్హం. అయితే ప్రజలు ఇచ్చిన అవకాశం ఇంకో మూడేళ్లు ఉన్నందున జనాల నాడీ తెలిసిన కేసీఆర్ అప్పటివరకు మరో బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసి ఈ టర్మ్‌ సైతం సక్సెస్‌ ఫుల్ సీఎం అనిపించుకుంటారని పలువురు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.

Advertisement

Next Story