కేసీఆర్ ఇలాకాలో దుమ్ములేపిన కాంగ్రెస్.. రేవంత్ రాకతో కార్యకర్తలలో రెట్టింపు ఉత్సాహం..

by Shyam |
కేసీఆర్ ఇలాకాలో దుమ్ములేపిన కాంగ్రెస్.. రేవంత్ రాకతో కార్యకర్తలలో రెట్టింపు ఉత్సాహం..
X

దిశ ప్రతినిధి, మెదక్: గజ్వేల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోర సభకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. ఒకే రోజున రెండు జాతీయ పార్టీల సమావేశాలు ఉండటంతో ఈ సభకు జనం తక్కువ సంఖ్యలోనే హాజరవుతారని అంచనా వేశారు. కానీ అందుకు భిన్నంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సమావేశాన్ని కాదని కాంగ్రెస్ పార్టీ సమావేశానికి అంతకు రెట్టింపు మంది జనం హాజరయ్యారు. రాజీవ్ రహదారి మొత్తం కాంగ్రెస్ నాయకులతో నిండి పోయింది. సభ పైకి రేవంత్ రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అంటే జనం ఎంత పెద్ద ఎత్తున హాజరయ్యారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాగా రేవంత్ రాకకు ముందు నేతల ప్రసంగానికే మంత్రముగ్ధులైన జనం.. రేవంత్ వచ్చిన తర్వాత మరింత జోష్ తో కన్పించారు.

ఉత్తేజం నింపిన రేవంత్ ప్రసంగం..

రేవంత్ మాటలు బాగా ఉంటాయని అందరికి తెలుసు. నిన్నటి గజ్వేల్ వేదికగా తమ మాస్ మాటలకు క్లాస్ యాడ్ చేసి సీఎం కేసీఆర్ పై మరింత రెచ్చిపోయారు. రేవంత్ ప్రసంగం మొదలు.. ప్రసంగం ముగిసే వరకు కాంగ్రెస్ నాయకులు, అభిమానుల నినాదాలతో సభ దద్దరిల్లింది. సుమారు నలభై నిమిషాల పాటు మాట్లాడిన రేవంత్ ప్రసంగం అక్కడున్న వారినే కాదు టీవీల్లో చూస్తున్న వారిని ఆకట్టుకుంది. రేవంత్ ఒక్కో మాట ఒక్కో అణుబాంబులా పేల్చుతూ సీఎంపై మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలతో పాటు సీఎం స్వంత జిల్లా, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితుల బాధలు, గజ్వేల్ బస్టాండ్, ఇతరత్రా సమస్యలపై మాట్లాడారు. ఈ సమయంలో అక్కడున్న వారు మరింతగా నినాదాలు చేస్తూ కన్పించారు. మొత్తానికి రేవంత్ ప్రసంగం అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టిందనే చెప్పొచ్చు.

రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం ..

ఒకప్పుడు మెతుకు సీమపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడేది. అంతటి పట్టున్న కాంగ్రెస్ ఈ మధ్య కాలంలో బలహీన పడిన విషయం తెలిసిందే. ఇటీవల టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నియామకంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. యువ నాయకుని ఆధ్వర్యంలో పనిచేసేందుకు కూడా చాలా మంది పక్క పార్టీ నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు ఊహాగానాలు వినబడుతున్నాయి. ఇదిలా ఉండగా నిన్న రేవంత్ తన ప్రసంగంలో సోనియమ్మ రాజ్యానికి మీరే అంబాసిడర్లు అంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపారు.

వచ్చే నెలలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడండి.. అధికారం మనదే అనిరేవంత్ ఇచ్చిన పిలుపుకు కట్టుబడి ఉన్నామంటూ కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రేవంత్ సమావేశం అనంతరం కొందరు కాంగ్రెస్ నాయకులతో “దిశ” మాట్లాడే ప్రయత్నం చేయగా.. వారందరూ కాంగ్రెస్ సభ సక్సెస్ అయ్యింది. రేవంత్ మాకు కొత్త రక్తాన్ని ఎక్కించాడు. ఇక రేవంతన్న నాయకత్వంలో పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడతామంటూ చెప్పారు. మరికొందరు మెతుకుసీమకు కాంగ్రెస్ పూర్వవైభవం తీసుకొస్తాం. కేసీఆర్, హరీశ్ అరాచకాలను ఎండగడుతూ వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాలు కాంగ్రెస్ విజయం సాధించేలా కృషి చేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story