ఖమ్మం నుంచే రేవంత్ యాక్షన్ ప్లాన్.. రెడీ అంటోన్న రేణుకా చౌదరి

by Anukaran |
ఖమ్మం నుంచే రేవంత్ యాక్షన్ ప్లాన్.. రెడీ అంటోన్న రేణుకా చౌదరి
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన కార్యాచరణను ఖమ్మం నుంచే మొదలు పెట్టనున్నారా..? భట్టి ఇలాకా నుంచైతేనే ఏకకాలంలో ‘ముగ్గురికి’ సమాధానం చెప్పొచ్చని భావిస్తున్నారా..? ఇప్పటికే ఆ దిశగా తన అనుయాయులతో మంతనాలు జరిపారా..? అంటే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అవుననే సమాధానం వస్తోంది. ఇదే విషయాన్ని శుక్రవారం ఖమ్మం ఆడబిడ్డగా పేరున్న రేణుకా చౌదరి సైతం ధ్రువీకరించారు. అధికార పార్టీపై యుద్ధం ఖమ్మం గుమ్మం నుంచే రేవంత్ స్టార్ట్ చేస్తారంటూ నొక్కి చెప్పారు. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

ఖమ్మం నుంచైతే.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు చెక్ పెట్టడమే కాకుండా.. షర్మిల పార్టీ (వైఎస్ఆర్టీపీ)ని కూడా ఆదిలోనే దెబ్బతీసి ఆ పార్టీవైపు ఎవరూ మళ్లకుండా ఉండేందుకు రేవంత్ ఈ జిల్లాను ఎంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అధికార పార్టీకి సైతం మొదట ఇక్కడి నుంచే తన ప్రతాపాన్ని చూపించాలని రేవంత్ ఫిక్సయినట్లు ఆయన అత్యంత సన్నిహితులు చెబుతున్న మాట. ఇంకో విషయం ఏంటంటే 2018 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా నడుస్తే.. ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ ఏకంగా ఆరు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని అధికార పార్టీకి సవాల్ విసిరింది. వీరిలో నలుగురు ఇప్పటికే కారెక్కారు.. అంటే పార్టీకి ఇక్కడి నుంచే మళ్లీ పూర్వ వైభవం తెచ్చే దిశగా రేవంత్ ఖమ్మం జిల్లాను ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మొదట భట్టికి చెక్..

ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీలో సీఎల్పీ నేతగా ఉన్న సంగతి తెలిసిందే. పీసీసీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఎంతగానో కృషిచేశారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని ఖరారు చేసే ముందు రోజు సీఎం కేసీఆర్‌ను కలిశారు భట్టి. దీనిపై కాంగ్రెస్ పెద్దలు సైతం ఆగ్రహంతో ఉన్నారని, షోకాజు నోటీసులు కూడా జారీ చేశారని తెలుస్తోంది. అంతేకాదు భట్టికి రేవంత్ వ్యతిరేక వర్గంగా పేరుంది. దీనికితోడు నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నా సీఎల్పీ నేతగా అడ్డుకోలేకపోయారనే అపవాదు ఉంది. వీటన్నింటినీ అధిగమించి ఖమ్మంలో కాంగ్రెస్‌‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రేవంత్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.

షర్మిల పార్టీకి ఆదిలోనే గండికొట్టాలని..

ఇన్నాళ్లూ సరైనా నాయకత్వం లేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పక్కచూపు చూశారు. ముఖ్యంగా షర్మిల పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. షర్మిల మొదటి నుంచి ఖమ్మం కోడలని, అక్కడి నుంచే తన కార్యాచరణ మొదలు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లానుంచే పోటీచేస్తారనే చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆదిలోనే షర్మిలను దెబ్బతీయాలనే వ్యూహరచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్టీపీకి ఖమ్మంలోనే ఎదురుగాలి వీస్తే ఇక రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభావం పెద్దగా ఉండదని, తద్వారా ఆ ఎఫెక్ట్ కాంగ్రెస్ పై ఉండదనేది రేవంత్ టీం అభిప్రాయం. ఈ క్రమంలోనే ఖమ్మంపై దృష్టిపెట్టి కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ తయారు చేసేలా ప్రణాళిక ఇప్పటినుంచే రూపొందించేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మళ్లీ రేణుక చౌదరి యాక్టివ్..

ఖమ్మం ఆడబిడ్డగా చెప్పుకునే రేణుకా చౌదరి ఎన్నికల సమయంలో తప్పా ఖమ్మం ప్రజలను పలకరించిన దాఖలాలు తక్కువ. అంతేకాదు.. జిల్లా కాంగ్రెస్ పార్టీలోని నేతల మధ్య పలు విభేదాల కారణంగా ఇన్నాళ్లూ రేణుక జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో తనకు సన్నిహితుడిగా పేరున్న రేవంత్ రెడ్డి పీసీసీ పీఠాన్ని దక్కించుకోవడంతో మళ్లీ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల్లో జోష్ పెరిగింది. శుక్రవారం రేవంత్ రెడ్డి హైదరాబాద్‎లోని రేణుక చౌదరి నివాసంలో కలిశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ సహా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు చెందిన రేణుక అనుచరులు, సన్నిహితులు, ముఖ్యనేతలందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరుకాలేదు. అయితే ఈ సందర్భంగా అధికార పార్టీపై కూడా ఖమ్మం నుంచే రేవంత్ యుద్ధం ప్రారంభిస్తామంటూ రేణుక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి.

కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్..

పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకం.. ఉపాధ్యక్షులుగా ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, పొదెం వీరయ్య కూడా ఉండడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నిండింది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న నేతల పార్టీ కార్యక్రమాలను ఇక మీదట చురుకుగా నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని పదినియోజకవర్గాల నుంచి పార్టీకి చెందిన ముఖ్యనేతలు, భారీగా కార్యకర్తలు రేవంత్‌ను కలిసేందుకు క్యూ కడుతున్నారు. మొత్తం మీద రేవంత్ మొదట ఖమ్మంపై దృష్టి పెట్టనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లా కార్యకర్తల్లో హుషారు నిండింది.

Advertisement

Next Story

Most Viewed