సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌పై రేవంత్ రెడ్డి అనుమానం

by Shyam |
Revanth Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: వంద పీనుగులను తిన్న రాబందు తీర్థయాత్ర చేసినట్టు కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రకటన ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి అన్నారు. శనివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం వానాకాలం పంట కళ్లాల్లోనే ఉందని, కొనుగోలు కోసం రైతులు 30 రోజులుగా ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భారీ వర్షాలతో ధాన్యం తడిసిపోయి, మొలకలు వచ్చిందని, ధాన్యంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ ఇస్తారో చెప్పాలని డిమాండ్​ చేశారు. ఆ విషయం వదిలేసి యాసంగి పంటపై ఇప్పుడు పంచాయితీ మొదలు పెట్టడం దేనికి సంకేతమని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్టుగా తెలంగాణ రైతుల ప్రయోజనాలు పట్టించుకోని కేసీఆర్ ఉత్తరాదిలో ఉద్యమం చేసిన రైతులకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో అనధికారికంగా 40వేల మంది రైతులు చనిపోయారని, ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 7,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు. కనీసం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పరామర్శించలేదని, నిన్నటికి నిన్న కామారెడ్డి జిల్లాలో బీరయ్య అనే రైతు వడ్ల కుప్పపై తొమ్మిది రోజులు పడిగాపులు పడి చనిపోతే పోస్టుమార్టం కూడా చేయకుండా సహజ మరణం అని అధికారులతో రాయించి కేసు మూసేసిన గజదొంగ ఇప్పుడు పెద్ద దానకర్ణుడులాగా నాటకాలు ఆడుతున్నాడని రేవంత్​రెడ్డి ఫైర్​ అయ్యాడు. జల వాటాల పంపకంలో మోడీ ముందు మోకరిల్లి కోర్టులో కేసు నాటకంతో ఏడేళ్లు కాలయాపనకు రెండు ప్రభుత్వాలు కారణం అయ్యాయని, ఢిల్లీలో టీఆర్‌ఎస్​పార్టీ ఆఫీసుకు స్థలం సాధించుకున్నారు కానీ రాష్ట్రంలో నీటి పంచాయితీ మాత్రం తీర్చలేకపోయారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఏదో మతలబు ఉంటుందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed