అసెంబ్లీ సమావేశాలు.. మీడియాకు ఆంక్షలు

by Shyam |
అసెంబ్లీ సమావేశాలు.. మీడియాకు ఆంక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలను కవర్ చేసే మీడియాకు ఆంక్షలు వచ్చిపడ్డాయి. కరోనా కారణంగానే నిబంధనలు అమలుచేయాల్సి వస్తోందని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక మీడియా సంస్థ నుంచి అసెంబ్లీకి ఒకరికి, కౌన్సిల్‌కు మరొకరికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరులో జరిగిన సమావేశాలకు అమలుచేసిన విధానాన్నే ఇప్పుడు కూడా అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్‌లాక్ పేరుతో అన్నింటికీ సడలింపులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల విషయంలో మాత్రం ఆంక్షలు విధిస్తోంది. అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి ‘నెగెటివ్’ అని తేలితేనే అనుమతి ఉంటుందని ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం జరిగింది. అయినా ఒక మీడియా సంస్థ నుంచి ఒక్కరికే అనే నిబంధన విధించడంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తాయి.

అన్నింటికీ వర్తించవా..?

నిన్నమొన్నటి వరకూ మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వందలాది మందితో ఆత్మీయ సమ్మేళనాల ను నిర్వహించారు. పార్టీ కార్యాలయాల్లో మీడియా సమావేశాలను పెట్టారు. కానీ ఎక్కడా మీడియా నుంచి ఒక్కరు మాత్రమే అనే నిబంధనను పాటించలేదు. సీఎం గత నెలలో హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో సైతం కరోనా నిబంధనలు అమలుకాలేదు. అధికార పార్టీ నాయకులు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశాలకు సైతం ఇలాంటి నిబంధనలు లేవు. కానీ అసెంబ్లీ సమావేశాల విషయంలో మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed