- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గణతంత్ర వేడుకల్లో రైతుల రణతంత్రం
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దేశరాజధాని రణరంగాన్ని తలపించింది. రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. చాలా చోట్ల పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి తమను అడ్డుకుంటున్న పోలీసులపైకి కొన్ని చోట్ల రైతులు తల్వార్లు, కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులు కూడా ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. ట్రాక్టర్ డ్రైవర్‌లను లాఠీలు, లావైన కర్రలతో కుళ్లబొడిచారు. దీంతో అక్కడక్కడా ట్రాక్టర్‌లపైనుంచీ రైతులు కింద పడిపోయారు.
పోలీసులు, రైతులకు మధ్య కుదిరిన ఒప్పంద మార్గాలకు పరిమితమవకుండా సెంట్రల్ ఢిల్లీలోకి రైతులు చొచ్చకు వెళ్లారు. పార్లమెంటుకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉండే ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్(ఐటీవో) సమీపంలో సుమారు గంటకు పైనే ఆందోళనకారులు చెలరేగారు. పోలీసుల బారికేడ్లకు బదులుగా అడ్డంగా ఉంచిన బస్సులను ట్రాక్టర్‌లతో నెట్టేసి ఎర్రకోటకు వెళ్లారు. అక్కడ సిక్కుల పతాకాన్ని (నిషాన్ సాహిబ్) ఎగరేశారు. అదుపు తప్పిన ఆందోళనకారులను నియంత్రించే క్రమంలో పోలీసులూ లాఠీచార్జ్ చేశారు.
టియర్ గ్యాస్ ప్రయోగించారు. సింఘు, ఘాజీపూర్, టిక్రి, ముకర్బా చౌక్, నంగ్లోయ్‌లలో టెలికాం సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. రైతులు వారిచ్చిన హామీలకు కట్టుబడలేదని, విధ్వంసానికి పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కాగా, ఆందోళనలోకి కొన్ని సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. ఎర్రకోట దగ్గరకు తమ సంఘాలకు చెందినవారెవరూ వెళ్లలేదని ఉద్ఘాటించింది. సాయంత్ర సమయంలో ఆందోళనలో పాల్గొన్న రైతులందరూ తమ తమ నిరసన స్థలాలకు చేరుకోవాలని సంఘాలు పిలుపునిచ్చాయి. కాగా, పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి అదనపు బలగాలు మోహరింపునకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు.
మార్గాల మీద ఏకాభిప్రాయం కుదిరినా
నూతన సాగు చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలు 60వ రోజుకు చేరిన సందర్భంగా గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ పరేడ్ చేపట్టడానికి రైతులు నిర్ణయించారు. దీనికోసం రైతులు, ఢిల్లీ పోలీసులు పలుసార్లు సమావేశమై కొన్ని మార్గాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. అధికారిక వేడుకలు పూర్తయిన తర్వాత మూడు నిరసన స్థలాలు సింఘు, టిక్రి, ఘాజీపూర్ నుంచి రైతుల ట్రాక్టర్ పరేడ్ ప్రారంభించాలి. నిర్దేశించిన సమయానికి ముందే రైతులు బారికేడ్లను ధ్వంసం చేసి పరేడ్ ప్రారంభించారు. చాలా చోట్ల పోలీసులు వారించినా ఖాతరుచేయకుండా దూకుడగా ర్యాలీ తీశారు.
ఘాజీపూర్‌లో ప్రారంభంలోనే ఘర్షణలు జరిగాయి. నిర్దేశించుకున్న దారిని తప్పడానికి యత్నించగా ఉత్తర ఢిల్లీలోని ముకర్బా చౌక్‌లో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నోయిడాలో కొందరు ఆందోళనకారులు తల్వార్లు తీసి వీరంగం సృష్టించారు. చింతామణి చౌక్, నంగ్లోయ్‌లు సహా పలుచోట్ల పోలీసుల లాఠీచార్జ్ జరిగింది. ఘాజీపూర్ నుంచి వచ్చిన ట్రాక్టర్లు అక్షరధామ్ దగ్గర యూ టర్న్ తీసుకోవాలి. అక్కడున్న బారికేడ్లను తోసుకెళ్తూ రైట్ టర్న్ తీసుకుని యమునా నది మీదుగా ఐటీవో ఆఫీసుకు చేరారు. అక్కడి నుంచి ఎర్రకోట్ పోకుండా అడ్డుకున్న పోలీసులపైకి దాడికి దిగారు.
ఢిల్లీ ప్రభుత్వ బస్సులను ధ్వంసం చేశారు. పోలీసులు చేతులెత్తేయడంతో రైతులు రెడ్ ఫోర్ట్‌కు పరేడ్ తీశారు. అక్కడ జాతీయ జెండాకు సమానంగా రైతు సంఘాల పతాకం, సిక్కుల జెండాను ఎగరేశారు. ఎర్రకోటపైకీ ఎక్కి నినాదాలు చేశారు. ‘ఇక్కడకు వచ్చి ప్రధాని మోడీకి తాము ఇవ్వాలనుకున్న సందేశం ఇచ్చేశాం’ అని కొందరు యువకులు మీడియాకు తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి.. 75 మంది పోలీసులకు గాయాలు
ఢిల్లీలోని డీడీయూ మార్గ్‌లో పరేడ్‌లో పాల్గొన్న ఓ ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ రైతు మరణించారు. ట్రాక్టర్ ర్యాలీ ఘర్షణల్లో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 75 మంది పోలీసులు ఢిల్లీలోని పలుచోట్ల గాయాలపాలైనట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఉత్తర ఢిల్లీలో 41 మంది పోలీసులు, తూర్పు ఢిల్లీలో 34 మంది పోలీసులు గాయపడ్డట్టు తెలిపారు. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ పోలీసులు, హోం శాఖ అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. హింసపై అమిత్ షాకు హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా వివరించారు. పరిస్థితులను అదుపులోకి తేవడానికి అదనపు పారామిలిటరీ ట్రూపులను మోహరించాలని అమిత్ షా ఆదేశించారు. ఈ భేటీలో ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ, ఐబీ డైరెక్టర్ అరవింద్ కుమార్ పాల్గొన్నారు.
హింసను ఖండిస్తున్నాం: ఎస్‌కేఎం
తాము ట్రాక్టర్ పరేడ్‌ను శాంతియుతంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నామని. కొన్ని సంఘవిద్రోహ శక్తులు ర్యాలీలోకి చొరబడ్డాయని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కొన్ని సంఘాలు, కొందరు తమ నిర్ణయాలను ఉల్లంఘించారని వివరించింది. ఖండనార్హమైన చర్యలకు పూనుకున్నారని పేర్కొంది. శాంతినే తమ ఆయుధంగా భావిస్తున్నామని, హింసాత్మక ఘటనలను ఖండిస్తున్నామని తెలిపింది. ఆరునెలలపాటు సుదీర్ఘంగా చేపడుతున్న తమ నిరసనల కారణంగా ఒకరకమైన ఆవేశం పొంగిపొర్లి ఉండవచ్చునని అభిప్రాయపడింది. అందరూ సంయమనం పాటించి శాంతియుత నిరసన చేయాలని రైతులను అభ్యర్థించింది. భవిష్యత్ కార్యచరణపై చర్చించి త్వరలో వెల్లడిస్తామని వివరించింది.
అమెరికన్ ఎంబసీ అలర్ట్
ఢిల్లీ హింసాత్మక ఘటనల నేపథ్యంలో అమెరికన్ ఎంబీసీ ఆ దేశ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంటికే పరిమితమై చుట్టుపక్కల పరిస్థితులను సమీక్షించుకుని జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. రిపబ్లిక్ డే పరేడ్ రూట్, ఉత్తర ఢిల్లీ, ఇండియా గేట్ పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదని వివరించింది. స్థానిక మీడియాను అనుసరిస్తూ వ్యక్తిగత సెక్యూరిటీని సమీక్షించుకోవాలని సూచించింది. అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రటిక్ నేత జో బైడెన్ పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత అమెరికన్ ఎంబసీ ఈ అలర్ట్ చేయడం గమనార్హం. గతేడాది రిపబ్లిక్ డే రోజునా ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.