వరంగల్‌లో రంగం సిద్ధమవుతోంది..!

by Shyam |
వరంగల్‌లో రంగం సిద్ధమవుతోంది..!
X

దిశ‌, వ‌రంగ‌ల్ తూర్పు: వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలోని డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌న ముసాయిదా సిద్ధమైంది. ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక అధికారులు ప‌ది రోజుల పాటు గ్రేట‌ర్‌లో విస్తృతంగా ప‌ర్య‌టించి 66 డివిజ‌న్ల‌కు ఒక రూపం తీసుకొచ్చారు. శ‌నివారం అధికారులు, సిబ్బంది మ‌రోమారు స‌మావేశ‌మై ముసాయిదాపై చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. దీనిని ఆదివారం బల్దియా నోటీస్ బోర్డుపై అంటించ‌డంతో పాటు మీడియా స‌మావేశంలో వెల్ల‌డించనున్నారు. దీని ప్ర‌తుల‌ను ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల‌కు అందించ‌నున్నట్లు సమాచారం.

విలీన గ్రామాల్లోనే అధికం..

గ‌తంలో వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలో 58 డివిజ‌న్లు ఉండ‌గా వాటిని 66కు పెంచుతూ రాష్ట్ర పుర‌పాల‌క శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు విలీన గ్రామాల్లోనే అత్య‌ధికంగా నాలుగు డివిజ‌న్లు పెరగ‌నున్న‌ట్లు తెలిసింది. ఇందులో వ‌ర్ధన్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని విలీన గ్రామాల్లో మూడు, ప‌రకాల నియోజ‌క‌వ‌ర్గ ప‌ర‌ధిలోని విలీన గ్రామాల్లో ఒక‌టి చొప్పున పెరగ‌నున్నాయి. అదేవిధంగా తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండేసి చొప్పున డివిజ‌న్లు పెరగ‌నున్న‌ట్లు సమాచారం. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని గేట‌వ‌త‌లి ప్రాంతంలో ఒక డివిజ‌న్ పెరుగుతుండ‌గా గేటివ‌త‌లి ప్రాంతంలో మ‌రొక‌టి పెరుగుతున్న‌ట్లు తెలుస్తోంది.

పోలింగ్ కేంద్రాల ఆధారంగా..

గ‌తంలో మాదిరిగా జ‌నాభా ప్రాతిప‌దిక‌న కాకుండా ఈసారి పోలింగ్ కేంద్రాల ఆధారంగా పున‌ర్విభ‌జన చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆయా డివిజ‌న్ల‌లో ఉన్న పోలింగ్ కేంద్రాల‌ను లెక్కేసి అందులో ఎంత మంది ఓట‌ర్లు ఉన్నారో గుర్తించి దాని ఆధారంగా డివిజ‌న్ల పున‌ర్విభ‌జన పూర్తి చేసిన‌ట్లు సమాచారం. దీంతో ఒక్కో డివిజ‌న్‌లో ఎనిమిది వేల నుంచి 12మేల మంది ఓట‌ర్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

9 నుంచి అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌..

ముసాయిదాను 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు బ‌ల్దియాలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచ‌నున్నారు. 9 నుంచి సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు, రాజ‌కీయ నాయ‌కుల నుంచి అభ్యంత‌రాలు స్వీకరించ‌నున్నారు. ఈ ప్ర‌క్రియ ఈ నెల 15 వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఏడు రోజుల పాటు వ‌చ్చే అభ్యంత‌రాల‌న్నింటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. 16 నుంచి 21 వ‌ర‌కు ఆరు రోజుల పాటు డివిజ‌న్ల వారీగా ప‌ర్య‌టించి అభ్యంత‌రాలను తిరిగి ప‌రిశీలిస్తారు. చేర్పులు, మార్పుల‌పై అధికారులు చ‌ర్చ‌లు జ‌రుపుతారు.

22న సీడీఎంఏకు నివేదిక‌..

ప్ర‌జ‌లు, రాజ‌కీయ ప్ర‌తినిధుల‌నుంచి వ‌చ్చిన అభ్యంత‌రాల‌న్నింటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని రూపొందించిన కొత్త డివిజ‌న్ల నివేదిక‌ను ఈనెల 22న సీడీఎంఏకు అంద‌జేయ‌నున్నారు. మార్చి 23,24తేదీల్లో ఈ నివేదిక‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించి మార్చి 25న 66 డివిజ‌న్లతో కూడిన తుది నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

Advertisement

Next Story