వాడిన బ్యాటరీ సెల్ రసాయనాలతో ఫెర్టిలైజర్?

by Harish |
వాడిన బ్యాటరీ సెల్ రసాయనాలతో ఫెర్టిలైజర్?
X

దిశ, వెబ్‌డెస్క్: వినడానికి కొద్దిగా వింతగానే ఉండొచ్చు… ఎందుకంటే సెల్ బ్యాటరీల్లో వాడేది లోహం, మరి దాన్ని పంటల కోసం వాడే ఫెర్టిలైజర్‌గా ఎలా ఉపయోగిస్తారనే సందేహంలో తప్పు లేదు. కానీ ఇది నిజం.. వాడిపారేసిన బ్యాటరీలను రీసైకిల్ చేసిన లోహపు డస్ట్‌ను గోధుమ పంటల్లో ఫెర్టిలైజర్‌గా ఉపయోగించి ఓ ఆస్ట్రేలియా రీసైక్లింగ్ కంపెనీ మంచి ఫలితాలను రాబట్టింది.

స్థానిక పికప్ పాయింట్ల నుంచి లిథియం ఆస్ట్రేలియా కంపెనీ వారు.. వాడి పారేసిన ఆల్కలైన్ బ్యాటరీలను సేకరించారు. వాటిని నలగ్గొట్టి వాటి నుంచి జింక్, మాంగనీసు డస్టుని ఫిల్టర్ చేశారు. ఆ డస్ట్‌ని గ్లాస్ హౌసెస్‌లో కుండీల్లో పెంచుతున్న గోధుమ మొక్కల మీద ప్రయోగించారు. విక్టోరియాలోని తమ ఎన్విరోసస్ట్రీమ్ ఆస్ట్రేలియా రీసైక్లింగ్ ఫెసిలిటీ వారు ఈ ప్రయోగాలు చేశారు. గ్లాస్ హౌసెస్ ప్రయోగం మంచి ఫలితాలను ఇవ్వడంతో స్థానికంగా తక్కువ సారం కలిగిన పంటభూముల్లో వేశారు. ఈ డస్ట్ ఫెర్టిలైజర్ భూమి సారాన్ని పెంచడమే కాకుండా సాధారణ భూముల్లో పెంచిన దాని కంటే మంచి దిగుబడిని అందించిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆడ్రియన్ గ్రిఫిన్ తెలిపారు.

ఒక సంవత్సరంలో కొనుగోలైన ఆల్కలైన్ బ్యాటరీల్లో దాదాపు 97 శాతం ల్యాండ్‌ఫిల్ కిందే పోతున్నాయి. అంటే వీటిని రీసైకిల్ చేసే సదుపాయాలు లేకపోవడంతో ఊరికే డంపింగ్‌లో పడేయడంతో భూమిలో కలిసిపోతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రయోగాన్ని పెద్దమొత్తంలో చేస్తున్నట్లు గ్రిఫిన్ చెప్పారు. ఈ ప్రయోగాల వల్ల ఫలితం కొద్దిగా ఆలస్యమైనప్పటికీ రీసైక్లింగ్ పెరిగి ఎలక్ట్రానిక్ చెత్త తగ్గించే సదుపాయం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed