ఐటీ ఉద్యోగుల్లో రెసిషన్ గుబులు

by Shyam |   ( Updated:2020-03-30 09:28:34.0  )
ఐటీ ఉద్యోగుల్లో రెసిషన్ గుబులు
X

– కరోనా ప్రభావంతో 2008 రిపీట్ అవుతుందేమోనని టెన్షన్..
– అమెరికా, యూరప్‌ల పరిస్థితి మెరుగైతేనే కొత్త ప్రాజెక్టులంటున్న కంపెనీలు..
– తెలంగాణలో ఐటీ కంపెనీల వల్ల 12లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి..
– రియల్ ఎస్టేట్ ఎఫెక్టయ్యే చాన్స్..

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ భయంతో వర్క్ ఫ్రం హోంకు వెళ్లిన హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆఫీసులకువస్తారా.. శాశ్వతంగా ఇళ్లలోనే ఉంటారా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే శాశ్వతంగా ఇళ్లలో ఉండేది కరోనా సోకుతుందని కాదు.. కరోనా ఎఫెక్ట్ వల్ల వచ్చే ఆర్థిక మాంద్యం దెబ్బకి ఉద్యోగాలు పోవడం వల్ల అనే వాదన వినిపిస్తోంది. అమెరికా, యూరప్‌లాంటి పలు అభివృద్ధి చెందిన దేశాల్లో విజృంభిస్తున్న కరోనా కేసులతో లోకల్ ఐటీ కంపెనీలకు ఫ్యూచర్ బిజినెస్ ఎలా ఉంటుందో తెలియక దడ పుడుతున్నట్లు తెలుస్తోంది. ఆయా అభివృద్ధి చెందిన దేశాల్లోని బడా కంపెనీల నుంచి భారత సాఫ్ట్‌వేర్ కంపెనీలకు వచ్చే కొత్త ప్రాజెక్టులపై సందేహాలు నెలకొనడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఒక్క మార్చి నెలలోనే 3 నుంచి 4 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు ఒప్పందాలు వాయిదా పడినట్టు సమాచారం. అమెరికా, యూరప్‌‌లో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు పెరుగుతుండడంతో అక్కడి ఆర్థిక వ్యవస్థల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండి ఇప్పటికీ ప్రతి ఏడాది 3శాతం మేర వృద్ధి చెందుతున్న అమెరికా దేశమే.. భారత ప్రధాన ఐటీ కంపెనీల వ్యాపారానికి ఇప్పటివరకు కీలకంగా ఉంది. ఈ దేశంలోని బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, రిటైల్ బిజినెస్‌లు, పలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి చేసే సంస్థలు తమ తమ అవసరాల మేరకు సాఫ్ట్‌వేర్ సాంకేతికత కోసం ఇండియన్ ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులిస్తుంటాయి. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం, అవసరమైతే కొంత మంది ఉద్యోగులను ఆ దేశంలోని కంపెనీలకు పంపి అక్కడే పనిచేయించడం లాంటివి లోకల్ ఐటీ కంపెనీలు చేస్తుంటాయి. ఈ వ్యాపారం ప్రతి త్రైమాసికంలో కొన్ని వేలకోట్లలో జరుగుతుంటుంది. ఇలా ఈ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ సాంకేతికతలో క్వాలిఫికేషన్, స్కిల్ ఉన్నవాళ్లకు ఉద్యోగాలు లభించడంతో పాటు వాళ్ల జీతాలు సైతం ఆకర్షణీయంగా ఉంటాయి.

యూరప్ దేశాల్లోని బ్యాంకులు, ఇతర కంపెనీల నుంచి కూడా లోకల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు వస్తుంటాయి. కాగా, ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకి అమెరికా, యూరప్ దేశాల పరిస్థితి భయానకంగా మారింది. ఇప్పటివరకు అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా ఆదివారం నాటికి లక్షా 43వేలకు పైన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 20వేల కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా, 520 మరణాలు సంభవించాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి మొదట మార్చి 15న ప్రకటించిన 15రోజుల సోషల్ డిస్టెన్సింగ్ ప్రోగ్రాంను పొడిగించే అవకాశాలున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ప్రకటించారు. నిజానికి అమెరికాలో పూర్తిస్థాయిలో వైరస్ వ్యాప్తిని నియంత్రణలోకి తీసుకురావాలంటే ఏప్రిల్ 15న ఉన్న ఈస్టర్ వరకు సోషల్ డిస్టన్స్ పాటిస్తే సరిపోతుందని తాను ఆశించానని, అయితే జూన్ వరకు సోషల్ డిస్టెన్సింగ్‌ను పొడిగిస్తే గాని అమెరికాలో వైరస్ వ్యాప్తిని నిరోధించలేమని ట్రంప్ సంకేతాలిచ్చారు. కొత్త సోషల్ డిస్టన్సింగ్ ప్రోగ్రాం వివరాలను మార్చి 31న అధికారులు ప్రకటిస్తారని ఆయన తెలిపారు.

ట్రంప్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలతో ఆ దేశంలో ప్రజలు ఇళ్లకే పరిమితమై, వ్యాపారాలు మరిన్ని నెలలు మూతపడి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దేశం తాజాగా ప్రకటించిన నిరుద్యోగ గణాంకాల్లో నమోదైన వారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగినట్టు సమాచారం. ఇక ఇప్పటికే మాంద్యం పరిస్థితులు ఎదుర్కొంటున్న యూరప్‌ను కరోనా మరింత దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏకంగా బ్రిటన్ అధ్యక్షుడు బొరిస్ జాన్సన్‌కే కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

తెలంగాణలో గత 5ఏళ్లలో రెట్టింపైన ఐటీ ఎక్స్‌పోర్ట్స్..

తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఏటా జరిగే మొత్తం ఎగుమతుల్లో 50శాతం వాటా సాఫ్ట్‌వేర్ ఎగుమతులదే. హైదరాబాద్‌లో సమారు 1500 ఐటీ కంపెనీలుండగా వీటిలో ప్రత్యక్షంగా 5లక్షల మంది దాకా ఉద్యోగాలు చేస్తున్నారు. పరోక్షంగా మరో 7లక్షల మందికి ఈ కంపెనీల వల్ల ఉపాధి దొరుకుతోంది. తెలంగాణ ఏర్పడినప్పడు రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే మొత్తం ఐటీ ఉత్పత్తుల విలువ రూ.60 వేల కోట్లు ఉండగా ఇప్పడు ఆ విలువ లక్షా 9వేల కోట్లుంటుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా తాజాగా విడుదల చేసిన సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్ 2020 నివేదిక వెల్లడించింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎగుమతి అయ్యే ఐటీ ఉత్పత్తుల విలువ ప్రతి ఏడాది 13శాతం వృద్ధి చెందుతూ రాగా, ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య తెలంగాణ ఏర్పడిన 2014 నుంచి 2020 మార్చి వరకు 9శాతం వృద్ధి నమోదు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర మొత్తం స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ)లో సేవలరంగం వాటా 2014లో 57శాతం ఉండగా 2019 సంవత్సరానికల్లా ఆ వాటా జీఎస్‌డీపీలో ఏకంగా 65 శాతానికి చేరింది.

మాంద్యం వస్తే భారీగా ఉద్యోగాల కోత

అమెరికా, యూరప్‌లలో ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనా వల్ల ఆయా దేశాలు మాంద్యం బారిన పడితే వాటి ఆర్థిక వ్యవస్థల మీద ఆధార పడి హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న ఐటీ రంగం, ఆ రంగంలోని కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశాలునట్టు తెలుస్తోంది. దీంతో 2008 సబ్ ప్రైమ్ సంక్షోభంలో ఐటీ ఉద్యోగులు ఎదుర్కొన్న పరిస్థితులు మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న దాదాపు 12లక్షల మందిలో 3నుంచి 4లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు. ఇలా రాష్ట్ర జీఎస్డీపీలో ప్రముఖ వాటా కలిగిన ఐటీ రంగం ఎఫెక్టయితే ప్రభుత్వానికి హైదరాబాద్ సిటీ నుంచి వచ్చే పన్ను ఆదాయం కూడా భారీగా పడిపోయే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

రియల్ ఎస్టేట్ పై ప్రభావం

నోట్ల రద్దు, జీఎస్టీ, రెరా లాంటి వాటి వల్ల ఇప్పటికే ఓ మోస్తరుగా స్లో అయిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్, కరోనా వల్ల ఐటీ సెక్టార్ గనుక ఎఫెక్ట్ అయితే మాత్రం ఇప్పట్లో కోలుకోలేనంత దెబ్బ తింటుందని పలువురు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కమర్షియల్ స్పేస్, రెసిడెన్సియల్ స్పేస్ రెండిటిలోనూ లావాదేవీలకు ఐటీ రంగమే ఊతం. ఈ రంగం మాంద్యం బారిన పడితే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు తీవ్రంగా ప్రభావితమై ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయంలో భారీగా కోత పడనున్నట్టు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ అయిన రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఉద్యోగాల కోత పడే అవకాశం ఉందని వారంటున్నారు.

మార్చి వరకు పరిస్థితి బాగుందంటున్న కంపెనీలు

ఈ ఏడాది మార్చి వరకు కంపెనీల్లో బెంచ్ మీద ఉన్న(ఏ ప్రాజెక్టులో లేని ఉద్యోగులు) ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఏమీ లేదని స్థానిక ఐటీ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటివరకైతే అమెరికా, యూరప్ పరిస్థితులు కాస్త ఆందోళనకరంగానే ఉన్నాయని, ఇదే పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగితే అక్కడినుంచి వచ్చే ప్రాజెక్టుల పరిమాణం పడిపోతుందని అంటున్నారు. దీని వల్ల కంపెనీల రెవెన్యూ తగ్గి భారీ స్థాయిలో జీతాల ప్యాకేజీలు కలిగి ఉన్న సీనియర్, మిడ్ లెవెల్ ఉద్యోగుల్లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోక తప్పదని వారంటున్నారు.

Tags : corona, america, europe, recession, software companies, hyderabad, telangana, employment, gsdp

Advertisement

Next Story