ప్రపంచంలోనే ఈజీగా డబ్బులు వచ్చేదంటే ఇదొక్కటే.. కానీ,..

by Shyam |
ప్రపంచంలోనే ఈజీగా డబ్బులు వచ్చేదంటే ఇదొక్కటే.. కానీ,..
X

ప్రపంచంలోనే ఈజీగా డబ్బులు వచ్చేది ఏదంటే ఒక్క భూ దందాయే.. రియల్ ఎస్టేట్ రంగమొక్కటే.. కాస్త పెట్టుబడి పెడితే చాలు రూ.లక్షలు వచ్చి పడతాయి. ఒకవేళ ఏ పెట్టుబడి లేకపోయినా కాస్త మధ్యవర్తిత్వం చేస్తే చాలు.. కమీషన్ల పేరిట రూ.లక్షలు సంపాదించొచ్చు. తెలంగాణలో రెండు, మూడు దశాబ్దాలుగా భూ దందాలపై లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. కానీ నేడు కరోనా మహమ్మారి రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో లావాదేవీల సంఖ్య పది శాతానికి పడిపోయింది. కొనుగోళ్లు లేక మధ్యవర్తులకు పైసా కమీషన్‌ అందడం లేదు. అనేక మంది బ్రోకరేజ్ మానుకుని చిన్న చిన్నషాపులు ఏర్పాటు చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు.

దిశ, న్యూస్ బ్యూరో : కరోనా మహమ్మారితో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. క్రయవిక్రయాలు లేక కమీషన్ ఏజెంట్లు, బిల్డర్లు నానా అగచాట్లు పడుతున్నారు. లాక్‌డౌన్ ప్రారంభంలో మూసిన ఆఫీసుల్లో నేటికీ తెరవని ఆఫీసులే అధికం. అగ్రిమెంట్ల కాలపరిమితి ముగియడంతో కొనుగోలుదారులు, బిల్డర్లు, మధ్యవర్తులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చెల్లించిన అడ్వాన్సు వెనక్కి ఇస్తారో లేదోనన్న ఆందోళనతో కొనుగోలుదారులు బిక్కబిక్కుమంటున్నారు. గడువు ముగియడంతో కొందరు బిల్డర్లు లాయర్ల ద్వారా నోటీసులు పంపుతున్నారు.

కమీషన్లు రాక బతుకులు దుర్భరం

హైదరాబాద్ చుట్టూ ఉన్నరంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో లక్ష మందికి పైగా దందాలో పెట్టుబడులు పెట్టి, మధ్యవర్తిత్వం చేసి సమస్యలను ఎదుర్కొన్నట్లు అంచనా. కమీషన్ల మీదనే బతుకుతున్న వారు ఉపాధి కోల్పోయారు. రియల్ ఎస్టేట్ కార్యాలయాలన్నీ బోసితున్నాయి. కరోనా వైరస్ రాకతో లక్షల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి.

పట్నం 20, లోకల్ 80

నగర శివార్లలో సాగే భూదందాలో నగరవాసులు 20 శాతం ఉంటే, స్థానికులు 80 శాతం వరకు ఉన్నారు. ఐతే స్థానికంగా ఉండేవారిలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య చాలా తక్కువ. భూ క్రయవిక్రయాలు లేకపోవడంతో దళారులు ఇతర వ్యాపకాల వైపు మళ్లుతున్నారు. నూటికి 90 శాతం మంది సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు, చైర్మన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనే ఉన్నారు. వారికిప్పుడు సంపాదన పడిపోయింది. అప్పుల్లో కూరుకుపోవడంతో కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు.

వ్యథలు.. కథలు

– ఇబ్రహీంపట్నం మండలం నోములలో రూ.70 లక్షలకు ఎకరం వంతున రెండెకరాలు కొనుగోలు చేశారు. అంటే రూ.1.50 కోట్లు అన్నమాట. రూ.50 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చి అగ్రిమెంటు రాసుకున్నారు. కానీ లాక్‌డౌన్, కరోనాతో డబ్బులు చేతికందలేదు. దాంతో గడువు ముగిసింది. విక్రయించిన వ్యక్తి టైం అయిపోయిందని, ఇప్పుడు అగ్రిమెంటు చెల్లదన్నాడు. అంతే.. ఇరువర్గాల మధ్య లాయర్ నోటీసుల పర్వం మొదలైంది. పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టారు. ఎంత మంది చెప్పినా ఇరువర్గాలు ఒప్పుకోవడం లేదు.

– సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రకరణ్‌లో ఓ నాలుగు ఎకరాలను శంకర్‌పల్లి మండలంలోని ఓ సర్పంచ్ కొనుగోలు చేశాడు. ఎకరం రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కొంత డబ్బు అక్కడాఇక్కడా తీసుకొచ్చి అడ్వాన్సుగా ఇచ్చాడు. ఇప్పుడేమో ఎవరూ కొనడానికి ముందుకు రావడం లేదు. తీసుకొచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నాడు. ఎందుకు కొన్నానురో ఈ భూమి.. అంటూ తన సన్నిహితుల వద్ద వాపోయాడు.

– శామీర్ పేటలో ఒకాయన ప్లాటు కొన్నాడు. అగ్రిమెంటు టైం ముగుస్తుండడం, డబ్బులెక్కడా దొరక్కపోవడంతో తన సొంతింట్లో సగం అమ్మడం ద్వారా వచ్చిన సొమ్ముతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అగ్రిమెంటుకు పెట్టిన డబ్బులు పోతాయన్న భయంతో సొంతింటినే అమ్ముకోవాల్సి వచ్చింది.

– విజయవాడ హైవేలో నల్లగొండ వరకు, యాదాద్రి జిల్లా మొత్తం, నల్లగొండ జిల్లాలో చాలా ప్రాంతాల్లో సాగు భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ఇప్పుడా అగ్రిమెంట్లన్నీ గడువు ముగుస్తుండడంతో వేలాది మంది రియల్టర్లు కలవరపడుతున్నారు. విక్రయించిన వాళ్లను మరికొంత టైం ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు.

– శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, శామీర్ పేట, ఘట్ కేసర్, కీసర, యాచారం మండలాల్లో సెటిల్మెంట్ల వ్యవహారం నడుస్తోంది. ఏ చౌరస్తాలో చూసినా అదే దృశ్యాలు కనిపిస్తున్నాయి.

– ఈఎంఐ సదుపాయంతో ప్లాటు విక్రయించే దందా మాత్రం నామమాత్రంగా నడుస్తోంది. మధ్య తరగతి వర్గాలు నెలకిన్ని డబ్బులు కట్టుకుంటూ ప్లాట్లను సొంతం చేసుకునేందుకు పలు రియల్ ఎస్టేట్ సంస్థలు అవకాశం కల్పించాయి. ప్రధానంగా యాదాద్రి, షాద్ నగర్, చౌటుప్పల్ పరిసరాల్లోని వెంచర్లలో ఈ సదుపాయం ఉంది. నేటి క్లిష్ట పరిస్థితుల్లో వారి బిజినెస్ కొనసాగుతుండడం విశేషం.

Advertisement

Next Story