ఐపీఎల్: సెంటిమెంట్ పునరావృతం.. బోణి కొట్టిన RCB

by Anukaran |
RCB
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ అంటే బ్యాట్స్‌మెన్ గేమ్. టీ20 ఫార్మాట్ అంటేనే పరుగుల వరద పారుతుంది. కానీ ఐపీఎల్ 14వ సీజన్ బౌలర్ల ఆధిపత్యంతో సాగింది. సాధారణంగా సోగా ఉండే చపాక్ స్టేడియంలో పరిస్థితులను ఉపయోగించుకొని బెంగళూరు బౌలర్లు ముంబై బ్యాట్స్‌మెన్‌‌ను ముప్పతిప్పలు పెడితే.. సాధ్యమయ్యే లక్ష్యాన్ని ఛేదించడానికి బెంగళూరు కూడా ఆపసోపాలు పడింది. బెంగళూరు క్యాచ్‌లు వదిలేసినా ముంబై భారీ స్కోర్ సాధించలేదు. బెంగళూరు వికెట్లు పడుతున్నా ముంబై మాత్రం ఒత్తిడి తేలేకపోయింది. మొత్తానికి ముంబై జట్టు తొలి మ్యాచ్ ఓడిపోతుందనే సెంటిమెంట్ ఈ సీజన్‌లో కూడా కొనసాగింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ నిర్వహిస్తున్న ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది.

ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై జట్టు నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఓపెనర్లు 36 పరుగులు జోడించారు. ఎవరూ ఊహించని విధంగా విరాట్ కోహ్లీకి తోడుగా వాషింగ్టన్ సుందర్ ఓపెనర్‌గా వచ్చాడు. అయితే మొదటి నుంచి తడబడుతున్న సుందర్ (10) కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో క్రిస్ లిన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పటిదార్ (8) కూడా తక్కవ స్కోర్‌కే ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కలసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. కోహ్లీ నిలకడగా ఆడుతుండగా.. మ్యాక్స్‌వెల్ మాత్రం దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ కలసి మూడో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ (33) బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

ఆ తర్వాత కొద్ది సేపటికే దూకుడుగా ఆడుతున్న మ్యాక్స్‌వెల్ (39) జన్‌సెన్ బౌలింగ్‌లో లిన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. అప్పటి వరకు బెంగళూరు వైపు ఉన్న మ్యాచ్‌ను ముంబై బౌలర్లు తమవైపు తిప్పుకున్నారు. ఒక వైపు ఏబీ డివిలియర్స్ క్రీజులో నిలబడి పోరాడుతుంటే మరో ఎండ్‌లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఏబీ డివిలియర్స్ కేవలం 27 బంతుల్లో 48 పరుగులు చేసి బెంగళూరును దాదాపు విజయతీరాలకు చేర్చి చివరి ఓవర్లో అవుటయ్యాడు. అయితే చివర్లో హర్షల్ పటేల్ సమయోచితంగా ఆడి చివరి బంతికి విజయాన్ని అందించాడు. మొత్తానికి ఐపీఎల్ 2021లో తొలి మ్యాచ్ బెంగళూరు గెలచి పాయింట్ల పట్టికలో బోనీ కొట్టింది. బౌలింగ్‌లో 5 వికెట్లు తీయడంతో పాటు చివర్లో సమయోచితంగా ఆడిన హర్షల్ పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. బుమ్రా, జన్‌సెన్ తలా రెండు వికెట్లు, బౌల్ట్, కృనాల్ చెరో వికెట్ తీశారు.

లిన్ నిలబెట్టినా.. పటేల్ కూల్చేశాడు..

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ (19) అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. మరో ఎండ్‌లో ఉన్న క్రిస్ లిన్ సరైన కాల్ ఇవ్వకపోవడంతో రోహిత్ రనౌట్ అవకతప్పలేదు. ఆ తర్వాత లిన్, సూర్యకుమార్ యాదవ్ కలసి ఇన్నింగ్స్ నిలబెట్టారు. ఈ ఏడాదే ముంబై జట్టులో చేరిన లిన్, గత ఏడాది ఫామ్‌ను కొనసాగించిన సూర్యకుమార్ బౌండరీలు, సిక్సులతో స్కోర్ వేగం పెంచారు. వీరిద్దరిని కట్టడి చేయడానికి కోహ్లీ బౌలర్లు మార్చినా ఫలితం లేకపోయింది. లిన్, సూర్య కలసి రెండో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ (31) జేమిసన్ బౌలింగ్‌లో కీపర్ ఏబీ డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్రిస్ లిన్ (49) అవుటయ్యాడు. తనే బౌలింగ్ చేసి మిడ్ వికెట్‌వైపు వెనకకు పరిగెత్తి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (28), హార్దిక్ పాండ్యా (13) కాసేపు నిలబడ్డారు. వీరిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 30 పరుగులు జోడించారు.

ఇక ఇప్పటి నుంచి ఆర్సీబీ బౌలర్లు తమ సత్తా చూపించారు. ముఖ్యంగా హర్షల్ పటేల్ వరుసగా వికెట్లు తీసి ముంబై బ్యాటింగ్‌ను కుప్ప కూల్చాడు. తొలుత హార్దిక్ పాండ్యా (13)ను ఎల్బీగా పంపిన హర్షల్.. ఆ తర్వాత డేంజరస్ ఇషన్ కిషన్(28)ను కూడా ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ చేర్చాడు. ఇక ఆ తర్వాత ముంబై వికెట్ల పతనం కొనసాగింది. చివరి ఓవర్లో హర్షల్ ఏకంగా మూడు వికెట్లు తీశాడు. తొలి బంతికి కృనాల్ పాండ్యా (7) హర్షల్ బౌలింగ్‌లో క్రిస్టియన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. హార్డ్ హిట్టర్ కిరాన్ పొలార్డ్ (7) కూడా హర్షల్ బౌలింగ్‌లోనే సుందర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. హ్యాట్రిక్ మిస్ అయినా నాలుగో బంతికి మార్కో జన్‌సేన్‌ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో రాహుల్ చాహర్ (0) రనౌట్ అయ్యాడు. చివరి ఓవర్ వేసిన హర్షల్ కేవలం ఓకే పరుగు ఇచ్చి మూడు వికెట్లు తీయడం గమనార్హం. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. హర్షల్ పటేల్ 5 వికెట్లు తీయగా, కైల్ జేమిసన్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు.

స్కోర్ బోర్డు

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్

రోహిత్ శర్మ (రనౌట్) 19, క్రిస్ లిన్ (సి అండ్ బి) వాషింగ్టన్ సుందర్ 49, సూర్యకుమార్ యాదవ్ (సి) ఏబీ డివిలియర్స్ (బి) జేమిసన్ 31, ఇషాన్ కిషన్ (ఎల్బీడబ్ల్యూ)(బి) హర్షల్ పటేల్ 28, హార్దిక్ పాండ్యా (ఎల్బీడబ్ల్యూ)(బి) హర్షల్ పటేల్ 13, కిరాన్ పొలార్డ్ (సి) వాషింగ్టన్ సుందర్ (బి) హర్షల్ పటేల్ 7, కృనాల్ పాండ్యా (సి) క్రిస్టియన్ (బి) హర్షల్ పటేల్ 7, మార్కో జన్‌సెన్ (బి) హర్షల్ పటేల్ 0, రాహుల్ చాహర్ (రనౌట్) 0, జస్ప్రిత్ బుమ్రా 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లు) 159/9

వికెట్ల పతనం : 1-24, 2-94, 3-105, 4-135, 5-145, 6-158, 7-158, 8-158, 9-159

బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ (4-0-22-0), కైల్ జేమిసన్ (4-0-27-1), యజువేంద్ర చాహల్ (4-0-41-0), షాబాజ్ అహ్మద్ (1-0-14-0), హర్షల్ పటేల్ (4-0-27-5), డాన్ క్రిస్టియన్ (2-0-21-0), వాషింగ్టన్ సుందర్ (1-0-7-1)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్

వాషింగ్టన్ సుందర్ (సి) క్రిస్ లిన్ (బి) కృనాల్ పాండ్యా 10, విరాట్ కోహ్లీ (ఎల్బీడబ్ల్యూ)(బి) జస్ప్రిత్ బుమ్రా 33, రజత్ పటిదార్ (బి) ట్రెంట్ బౌల్ట్ 8, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (సి) క్రిస్ లిన్ (బి) జన్‌సెన్ 39, ఏబీ డివిలియర్స్ (రనౌట్) 48, షాబాజ్ అహ్మద్ (సి) కృనాల్ పాండ్యా (బి) జన్‌సెన్ 1, డాన్ క్రిస్టియన్ (సి) రాహుల్ చాహర్ (బి) జస్ప్రిత్ బుమ్రా 1, కైల్ జేమిసన్ (రనౌట్) 4, హర్షల్ పటేల్ 4 నాటౌట్, మహ్మద్ సిరాస్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లు) 160/8

బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ (4-0-36-1), జస్ప్రిత్ బుమ్రా (4-0-26-2), మార్కో జన్‌సెన్ (4-0-28-2), కృనాల్ పాండ్యా (4-0-25-1), రాహుల్ చాహర్ (4-0-43-0)

Advertisement

Next Story