దశలవారీగా ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ అమలు!

by Shamantha N |
దశలవారీగా ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ అమలు!
X

దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ కరెన్సీని దశల వారీగా వినియోగంలోకి తెచ్చేందుకు ఆర్‌బీఐ వ్యూహాత్మకంగా పనిచేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)కి సంబంధించి అక్టోబర్‌లోనే ప్రతిపాదన వచ్చిందని, ఆర్‌బీఐ దీన్ని త్వరలోనే విడుదల చేస్తుందని తెలిపారు. దీనికోసం ఆర్‌బీఐ చట్టం-1934 సవరణ చేయాల్సి ఉందన్నారు. ఆర్‌బీఐ తీసుకురాబోయే డిజిటల్ కరెన్సీతో నగదుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని, లావాదేవీలు, ఖర్చులు, సెటిల్‌మెంట్ రిస్కు తగ్గుతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

సీబీడీసీకి ఆర్‌బీఐ మద్దతు ఉన్నందున ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల వల్ల ఏర్పడే సమస్యలు పెద్దగా ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. అలాగే, మరో సందర్భంలో మాట్లాడిన ఆర్థిక మంత్రి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా మొత్తం 61 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ కి వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో అన్నారు. ఈ ఐపీఓల ద్వారా మొత్తం రూ. 52,759 కోట్ల నిధులను కంపెనీలు సమీకరించాయని, గతేడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువని ఆర్థిక మంత్రి తెలిపారు.

మొత్తం 61 కంపెనీల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలే 34 ఉన్నాయని, గత కొంతకాలంగా తయారీ, సేవల రంగంలోని సంస్థలు లిస్టింగ్‌కు వస్తున్నాయని పేర్కొన్నారు. 2020 ఏడాది మొత్తానికి మొత్తం 56 కంపెనీలు ఐపీఓ ల ద్వారా రూ. 31,060 కోట్ల నిధులను రాబట్టాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ఏడాదిలో మొత్తం కంపెనీల్లో 35 రూ. 100 కోట్లను, 4 కంపెనీలు రూ. 100-500 కోట్లను, 22 కంపెనీలు రూ. 500 కోట్లకు మించిన నిధులను సమీకరించాయన్నారు. వీటిలో 10 కంపెనీలు హెల్త్‌కేర్ రంగం నుంచి, సిమెంట్, నిర్మాణ రంగం నుంచి 6 కంపెనీలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed