‘సామాజిక మాధ్యమాలు చట్టాలను పాటించాలి’

by Shamantha N |   ( Updated:2021-02-11 05:30:03.0  )
‘సామాజిక మాధ్యమాలు చట్టాలను పాటించాలి’
X

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వాదోపవాదాలు జరుగుతున్న వేళ సామాజిక మాధ్యమాలపై కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ రవిశంకర్ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికలు భారత చట్టాలకు లోబడి నడుచుకోవాలని, ఇక్కడి చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమెరికాలో క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగినప్పుడు ఒకలా, భారత్‌లో లాల్ ఖిల్లాపై దాడి జరిగినప్పుడు ఇంకోలా వ్యవహరించడం తగదని, ద్వంద్వ వైఖరిని ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. ట్రాక్టర్ పరేడ్‌ హింసకు సంబంధించి కొన్ని ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. కానీ, భావప్రకటన స్వేచ్ఛను ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వం సూచించిన అన్ని ఖాతాలను ట్విట్టర్ నిలిపేయలేదు.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం సమావేశమవుతున్నది. కేంద్రం ఆదేశాలను ట్విట్టర్ పాటించని సందర్భంలో కేంద్ర మంత్రి రవిశంకర్ సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. ‘దయచేసి శత్రుత్వాన్ని, హింసను, వదంతులను ప్రచారం చేయవద్దు. భారత రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలి. ఈ దేశంలో నిర్దేశించిన ప్రమాణాలను పాటించాలి’ అని సూచించారు. ‘భారత రాజ్యాంగం భావప్రకటన స్వేచ్ఛను కల్పిస్తున్నది. అదే సమయంలో దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు భంగం వాటిల్లకుండా వాటిపై ఆంక్షలు విధించడానికీ అవకాశమిచ్చింది. పాత్రికేయ స్వేచ్ఛ, వ్యక్తుల హక్కులకూ కేంద్రం కట్టుబడి ఉన్నది. అదే సమయంలో దేశ భద్రత, రక్షణ, శాంతి భద్రతలను కాపాడే బాధ్యతలనూ కలిగి ఉన్నది. అభ్యంతరకర పోస్టులపై చర్యలు తీసుకోవడానికి సోషల్ మీడియా సంస్థలు సొంతంగా నిబంధనలు ఏర్పాటుచేసుకోవచ్చు. కానీ, వాటిని పాటించి భారత చట్టాలను ఉల్లంఘిస్తామని అనుకోరాదు’ అని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed