పక్కదారి పడుతున్న ‘రేషన్’ బియ్యం

by Sumithra |
పక్కదారి పడుతున్న ‘రేషన్’ బియ్యం
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : వికారాబాద్ జిల్లాలోని పలుచోట్ల పేదలకు అందాల్సిన ‘రేషన్’ పక్కదారి పడుతోంది. క్వింటాళ్లకొద్దీ అక్రమార్కులు పందికొక్కుల్లా కొల్లగొడుతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జిల్లా బోర్డర్ దాటిస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలదే ప్రధాన పాత్ర అని పలువురు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ నాయకులపై విమర్శల వర్షం కురిపిస్తూ కొన్ని చోట్ల కాపుకాసి మరి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకుంటున్నారు. అయితే ఈ తతంగాన్ని అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

వికారాబాద్ జిల్లాలో 588 రేషన్‌ షాపులు ఉండగా, 2,34,947 కార్డులు ఉన్నాయి. అయితే పరిగి కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇటీవల 29 కేసుల్లో 360.96 క్వింటాళ్లు పట్టుబడ్డాయి. అక్రమార్కులు మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్‌కు గుట్టుచప్పుడు కాకుండా బియ్యాన్ని తరలిస్తున్నారు. వీటిని అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. ఒకవేళ పట్టుకునప్పటికీ వాహన యజమానిపై తాత్కలికంగా కేసు నమోదు చేసి వదిలేస్తున్నారు తప్ప ఆ బియ్యం వెనుక ఉన్న సూత్ర, పాత్రదారులను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

అధికారులు పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం ఈ దందాలో అధికార పార్టీకి చెందిన బడా నేతలు ఉండడమేనని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల పరిగి మండలం కుద్వన్పూర్ గ్రామంలో పట్టుబడిన బియ్యంతో అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వార్ నడిచేలా చేసింది. అక్కడ180 క్వింటాళ్ల బియ్యం కాంగ్రెస్ నేతలు కాపు కాసి పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని పూడూర్ మండలానికి చెందిన టీఆర్ఎస్ నేత ఒక మాజీ ఎమ్మెల్యేకు బీనామిగా పనిచేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పేదలకు అందాల్సిన బియ్యానికి అధికార పార్టీ నేతలు కన్నం వేస్తున్నారనే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు ఇచ్చిన తర్వాత మిగిలిన బియ్యం తీసుకెళ్తే తప్పేంటని అధికార పార్టీ నేతలు ఎదురు ప్రశ్నించడం గమనార్హం.

పట్టబడ్డ కొన్ని ఘటనలు..

* దౌల్తాబాద్ మండలంలో నవంబర్ 7న 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
* పరిగిలో నవంబర్ 9న189 క్వింటాళ్లు పట్టుబడ్డాయి. ఇద్దరిపై కేసు నమోదైంది.
* వికారాబాద్, కొడంగల్లో నవంబర్ 11నన అక్రమంగా నిల్వ చేసిన 390 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. 9 మందిపై కేసు నమోదు చేశారు.

తక్కువకు కొంటూ.. ఎక్కువకు అమ్ముతూ..

జిల్లాలో ప్రతి నెలా 8,639 మెట్రిక్‌ టన్నుల బియ్యం పేదలకు పంపిణీ చేస్తున్నారు. అయితే బియ్యం యథావిధిగానే ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. పంపిణీ పూర్తైయిన మరసటి రోజు నుంచి అక్రమ వ్యాపారుల అనుచరులు ఇంటింటికీ వెళ్లి రూ.10 నుంచి రూ.20కి కిలో చొప్పున వారి నుంచి కొనుగోలు చేస్తున్నారు. వాటిని లారీ లోడు అయ్యేంత సరుకు వచ్చేంత వరకు ప్రైవేట్ గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. తర్వాత ఆ బియ్యాన్ని సన్నగా చేసి 25కేజీల బ్యాగులను రూపొందించి మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే బీరు తయారు చేసే ప్రాంతాలకు, కోళ్ల దాణాకు ఆ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం. ఈ తతంగం జిల్లాలోని పరిగి, కుల్కచర్ల, వికారాబాద్‌, కొడంగల్‌, దౌల్తాబాద్‌, తాండూరు తదితర మండలాల్లో జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed