- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మం టు కొలొంబో.. బోర్డర్స్ దాటుతోన్న పీడీఎస్ రైస్!
దిశ ప్రతినిధి, ఖమ్మం : పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. టన్నుల కొద్ది పీడీఎస్ బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఖమ్మం నుంచి కొలొంబోకు కాకినాడ పోర్టు ద్వారా రవాణా చేస్తున్నారని, మరికొందరు లోకల్ దందా చేసే వారు స్థానికంగానే రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారని సమాచారం.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రాకు సరిహద్దున ఉండటంతో.. జిల్లా వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఖమ్మం జిల్లా మీదుగా టన్నుల కొద్దీ బియ్యం ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు.. అక్కడి నుంచి కాకినాడ పోర్టుకు తరలుతున్నాయి. అక్కడి నుంచి కొలంబోతో పాటు పలు దేశాలకు తరలిస్తున్నట్టు సమాచారం. ఈ స్కాం వెనుక రేషన్ డీలర్లు, గ్రామాల్లోని ఏజెంట్లు, ఇలా పెద్ద ఎత్తున నెట్ వర్క్‌తో ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా సైలెంట్‌గా సాగుతున్న ఈ దందా రెండ్రోజుల క్రితం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో 25 టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోవడంతో మళ్లీ తెరపైకొచ్చింది.
తక్కువ ధరకు కొనుగోలు..
లబ్ధిదారులు తీసుకున్న రేషన్ బియ్యాన్ని వారి వద్ద నుంచి కిలోకి రూ.4 నుంచి రూ.5 చొప్పున డీలర్లే కొంటున్నారు. వీటిని చిన్న వ్యాపారులకు రూ.13 నుంచి రూ.15 వరకు అమ్ముతున్నారు. చిన్న వ్యాపారులు ఇలా పెద్ద ఎత్తున్న బియ్యం కొనుగోలు చేసి బడా వ్యాపారులకు కిలో రూ.20 నుంచి 25 చొప్పున అమ్ముతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా భారీ మొత్తంలో బియ్యం సేకరించి వాటిని ఇతర రాష్ట్రాలకు, అక్కడి నుంచి ఇతర దేశాలకు రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో రూ. కోట్లు చేతులు మారుతున్నాయని ఓ వ్యాపారి చెబుతున్నాడు. ఖమ్మం టౌన్‌తో పాటు రూరల్, నేలకొండపల్లి, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి.. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, అశ్వారావుపేట తదితర ప్రాంతాల మీదుగా ఉభయ గోదావరి జిల్లాలకు.. అక్కడి నుంచి కాకినాడ పోర్ట్ కు.. ఆ తర్వాత అక్కడి నుంచి అధికంగా శ్రీలంకాలోని కొలంబోతో పాటు పలు దేశాలకు రేషన్ రైస్‌ను తరలిస్తున్నారు. తెలంగాణ నుంచి అధికంగా మహారాష్ట్ర, కర్ణాటక, గుల్బర్గా ప్రాంతాలకు సైతం రేషన్ బియ్యం తరలుతున్నట్టు సమాచారం. ఇలాంటి అక్రమార్కులకు స్థానక సివిల్ సప్లై అధికారులు, పోలీసులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా కొందరు సైతం రేషన్ బియ్యాన్ని సేకరించి పాలిష్ చేసి తిరిగి మార్కెట్ లో కిలో బియ్యాన్ని రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. వీరిదగ్గరి నుంచి సైతం అధికారులకు వాటాలు పోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మద్యం తయారీలో ఉపయోగం?
రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలిస్తూ పట్టుబడ్డ వారు మాత్రం.. మద్యం తయారీలో ఈ బియ్యాన్ని ఉపయోగిస్తున్నట్టు చెబుతుండటం గమనార్హం. మద్యం తయారీలో ఎక్కువగా బార్లీ, గోధుమలు ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం వాటి ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల.. బియ్యంతో మద్యం తయారు చేయడం వల్ల ఖర్చు చాలా తగ్గుతుందని అందుకే వీటిని విదేశాలకు తరలిస్తున్నట్టు చెబుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో రేషన్ బియ్యాన్ని రాగి సంకటిలో కలిపి అధిక ధరలకు విక్రయిస్తున్నారని సమాచారం.