రేషన్ బియ్యానికి ‘రెక్కలొచ్చే’.. ఒకే నెలలో మూడింతలు బోర్డర్ క్రాస్..?

by Sumithra |   ( Updated:2021-08-27 05:25:25.0  )
kamareddy
X

దిశ, కామారెడ్డి రూరల్ : కరోనా కాలంలో పేదలు పస్తూలు ఉండవద్దనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరికి నెలకు 15 కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయి. వీటిపైన కన్నేసిన కొందరు దళారులు మాఫియాగా ఏర్పడి రేషన్ బియ్యాన్ని పేదల వద్ద తక్కువ ధరకు కిలోకు రూ.8 నుంచి రూ.10 చొప్పున కొనుగోలు చేస్తూ భారీగా నిల్వ చేసి.. అడ్డదారుల్లో పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అయితే, అధికారుల అలసత్వమే మాఫియాకు పెట్టుబడిగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోగుచేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర తరలిస్తున్నారు. కామారెడ్డి జిల్లా మహారాష్ట్రతో సరిహద్దు పంచుకోవడంతో ఇది రేషన్ మాఫియాకు ఓ రకంగా కలిసొచ్చిన వ్యాపారంగా మారింది. ప్రతినెలా కంటే జూలై, ఆగస్టు మాసాల్లోనే భారీగా బియ్యాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. సేకరించిన బియ్యాన్ని ఆటోలు, ట్రాలీ వాహనాల్లో ఎవరికీ అనుమానం రాకుండా వివిధ మార్గాల గుండా గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.

అడపాదడపా దాడులు..

రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిలువరించాల్సిన సంబంధిత అధికారులు, పోలీసులు అడపాదడపా దాడులు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు ముడుపులు తీసుకొని వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కేవలం ఈ ఒక్క నెలలో 10 రోజుల వ్యవధిలోనే కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడుసార్లు రేషన్ బియ్యం పట్టుబడ్డాయంటే అక్రమ వ్యాపారం జోరు ఏ విధంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎవరికి అనుమానం రాకుండా గ్రామాల్లో నిల్వలు చేస్తూ సమయం చిక్కినప్పుడల్లా వాహనాల ద్వారా పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఇదే కోవలో భిక్కనూరు మండలం రామేశ్వరం పల్లి, కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామాల్లో వారం రోజుల క్రితం భారీగా బియ్యం నిల్వలను అధికారులు పట్టుకున్న విషయం విదితమే. గురువారం కామారెడ్డిలో 26 క్వింటాళ్ల బియ్యంతో పాటు వాహనాన్ని పట్టుకున్న విషయం పాఠకులకు తెలిసిందే. ఇలా గుట్టుచప్పుడు కాకుండా ఇంకా ఎన్ని నిల్వలు చేస్తూ అక్రమ రవాణా చేస్తున్నారనే విమర్శలు గుప్పు మంటున్నాయి. ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ వ్యాపారుల గుండెల్లో గుబులు పుట్టిస్తే తప్ప అక్రమ రవాణా ఆగదని పలువురు పేర్కొంటున్నారు.

పొరుగు జిల్లాల నుండి కామారెడ్డి మీదుగా తరలింపు..

కామారెడ్డి జిల్లా మహారాష్ట్రకు ఆనుకొని ఉండటంతో రాష్ట్రంలోని పొరుగు జిల్లాల నుంచి ఇక్కడకు భారీగా తరలి వస్తున్నాయనే సమాచారం. ఇందులో భాగంగానే గురువారం వరంగల్ జిల్లా నుంచి 26 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా కామారెడ్డిలో అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఇలా ఇతర జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో రేషన్ బియ్యం తరలి వెళ్తున్నాయనే సమాచారం.

నిఘా ఏది..

కామారెడ్డి జిల్లా కేంద్రానికి 43వ జాతీయ రహదారితో పాటు కరీంనగర్-కామారెడ్డి-ఎల్లారెడ్డి (కేకేవై) రహదారి కూడా ఉంది. అంతేకాకుండా కామారెడ్డి నుంచి బాన్సువాడకు సైతం రాష్ట్ర రహదారి ఉన్నది. జాతీయ రహదారి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతూ మహారాష్ట్రకు వెళుతుంది. కేకే వై రోడ్డు, బాన్సువాడ రోడ్లు జుక్కల్ మీదుగా మహారాష్ట్రకు కలుపుతాయి. దీంతో బియ్యం మాఫియాకు బియ్యాన్ని తరలించడానికి మార్గం చాలా సులువుగా ఉన్నట్లుగా అర్థం అవుతోంది. ఈ రోడ్లపై అధికారుల నిఘా ఉంటే తప్ప అక్రమ తరలింపులను అడ్డుకోవడం సాధ్యం కాదనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత భారీ ఎత్తున అక్రమ రవాణా జరుగుతున్నా అటు పోలీసులు గానీ, ఇటు సంబంధిత ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిఘాను కట్టుదిట్టం చేస్తే తప్ప అక్రమ రవాణాకు చెక్ పెట్టడం సాధ్యం కాదని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed