రంగనాయకసాగర్‌తో రైతుల కల సాకారం: మంత్రి హరీశ్‌రావు

by Shyam |
రంగనాయకసాగర్‌తో రైతుల కల సాకారం: మంత్రి హరీశ్‌రావు
X

దిశ, మెదక్: రంగనాయకసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల్లో నీటి విడుదలతో ఎన్నో ఏళ్ల రైతుల కల సాకారమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామంలోని రంగనాయకసాగర్ కుడి, ఎడమ కాలువలకు శనివారం నీళ్లు వదిలారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బిరబిరా గోదారి పరుగెడుతుంటే రైతన్న కంట ఆనందభాష్పాలు కారుతున్నాయన్నారు. కాలువల్లో నీటి విడుదలతో ఈరోజు మరుపు రాని రోజుగా గుర్తుండి పోతుందని చెప్పారు. ఈరోజు కోసం రైతులు తరతరాలుగా ఎదురు చూశారని గుర్తుచేశారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన సీఎం కేసీఆర్, ఇంజినీర్లకు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంతకాలం రైతులు కరెంట్, కాలం మీద ఆధారపడి వ్యవసాయం చేశారని, ఇక నుంచి కరెంట్, కాలంతో నిమిత్తం లేకుండా రెండు పంటలు పండించే రోజులు వచ్చాయన్నారు. రైతుల ఆత్మహత్యలు అనేవి ఇక ఉండవన్నారు. 365 రోజులపాటు రంగనాయకసాగర్‌కు నీళ్లు వస్తాయని కరువుకు శాశ్వతంగా ఫుల్‌స్టాప్ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుడి కాలువ ద్వారా 40 వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 70 వేల ఎకరాలు సాగునీరు అందుతుందని చెప్పారు. గోదావరి జల కల సాకారమైన వేళ మంత్రి హరీశ్ రావు సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.సెల్ఫీలు దిగుతూ హడావుడి చేశారు. కాలువలోని నీళ్లను ఎంపీ, ఎమ్మెల్యేలపై చల్లుతూ కాసేపు సంబురాన్ని పంచుకున్నారు. ఎడమ కాలువలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొద్దిసేపు ఈత కొట్టారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Siddipeta,Ranganayaka sagar, Minister Harish rao,canal

Advertisement

Next Story

Most Viewed