పుట్టినరోజు వేడుకలు వద్దంటున్న చెర్రీ

by Shyam |
పుట్టినరోజు వేడుకలు వద్దంటున్న చెర్రీ
X

ఉపద్రవం ముంచుకు వస్తున్నప్పుడు.. మనందరం ఏకతాటిపై నిలబడి ఎంతో సమర్థంగా ఎదుర్కొంటాం. సినీ తారలు కూడా ఆ విపత్తు సమయాల్లో తమవంతు పాత్ర పొషిస్తారు. కరోనా భయంతో ఇప్పటికే సినిమాహాళ్లు మూతపడ్డాయి. సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. సినీతారలు కూడా తమ అభిమానులను ఉద్దేశించి కరోనా కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచనలు చేస్తున్నారు. ప్ర‌తి ఏడాది ఘ‌నంగా జ‌రిగే హీరోల బ‌ర్త్‌డే వేడుకలు కూడా ఈసారి ర‌ద్దు అవుతున్నాయి. క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో హీరోలే స్వ‌యంగా త‌మ బ‌ర్త్ డే వేడుక‌ల‌ని జ‌ర‌పొద్దంటూ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పటికే ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు. తాజాగా చెర్రీ కూడా తన పుట్టినరోజు వేడుకులను జరపవద్దని అభిమానులకు మనవి చేశాడు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశాడు.

కరోనా గురించి బాధ్యతగా సినీహీరోలు తమ వంతు ప్రచారం చేస్తున్నారు. రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ కలిసి కరోనా నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తూ.. ఓ వీడియో రీలీజ్ చేసిన విషయం మనందరకీ తెలిసిందే. అయితే మార్చి 27న మెగా పవర్ స్టార్ హీరో రాంచరణ్ పుట్టిన రోజు. రాంచరణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ, వాటన్నింటికి ఫుల్‌స్టాప్ పెడుతూ తన బర్త్‌డే వేడుకలు చేయొద్దని అభిమానులను కోరుతూ రాంచరణ్ ఒక లేఖను విడుదల చేశారు. కరోనా వ్యాప్తి చెందుతుండటంతో తన అభిమానులంతా ప్రజలలో కరోనా గురించి అవగాహన కల్పించాలని ఆయన కోరారు. అదే తనకిచ్చే పెద్ద గిఫ్ట్ అని ఆయన అన్నారు. రాంచరణ్ తన లేఖలో కింది విధంగా పేర్కొన్నారు.

అభిమానులకో లేఖ:

‘మీకు నా మీద ఉన్న ప్రేమ, నా పుట్టిన రోజును పండుగగా జరపడానికి మీరు పడుతున్న కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. మనం ఉన్న ఈ అసాధారణ పరిస్థితులు మీకు తెలియనివి కావు. ఇలాంటి సందర్భంలో మనం సాధ్యమైనంత వరకు జన సాంద్రత తక్కువగా ఉండేట్లు చూసుకుంటూ ఉండటం మంచిది. ఇది మనసులో పెట్టుకొని ఈ సంవత్సరం నా పుట్టినరోజు వేడుకలను విరమించుకోవాల్సిందిగా నా మనవి.

మీరంతా మన అధికారులకు సహకరించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేసి మీ వంతు సామాజిక బాధ్యతని నెరవేర్చితే అదే నాకు ఈ సంవత్సరం మీరు ఇచ్చే అతిపెద్ద పుట్టిన రోజు కానుక. నా ఈ మనవిని మీరంతా సహృదయంతో స్వీకరించి పాటిస్తారని ఆశిస్తున్నాను.’ చెర్రీ బర్త్‌డే సందర్భంగా వెంక‌టాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌, రాష్ట్ర చిరంజీవి యువ‌త జ‌న‌రల్ సెక్ర‌ట‌రీ శివ చెర్రీ ఇన్‌ఫినిటమ్‌ మీడియాతో క‌లిసి ఓ స్పెషల్‌ సాంగ్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమో అభిమానులను విశేషంగా ఆకట్టుకోగా పూర్తి పాటను ఈ నెల 24న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు.

tags : ram charan, ntr, birthday, march 27, corona, cherry birthday,

Advertisement

Next Story

Most Viewed