దేశవ్యాప్తంగా ప్రశాంతంగా… ముగిసిన రాజ్యసభ పోలింగ్

by Shamantha N |
దేశవ్యాప్తంగా ప్రశాంతంగా… ముగిసిన రాజ్యసభ పోలింగ్
X

న్యూఢిల్లీ: 19 రాజ్యసభ సీట్లకు ఈ రోజు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన ఈ పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. కాగా, ఓట్ల కౌంటింగ్ ఐదు గంటలకు మొదలైంది. ఈ ఎన్నికలు ఎనిమిది రాష్ట్రాల్లో జరిగాయి. గుజరాత్(4 సీట్లు), ఆంధ్రప్రదేశ్(4 సీట్లు), రాజస్తాన్(3 సీట్లు), మధ్యప్రదేశ్(3 సీట్లు), జార్ఖండ్(2 సీట్లు), మణిపూర్(ఒక సీటు), మేఘాలయ(ఒక సీటు), మిజోరం(ఒక సీటు)లలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ రోటీన్ ఏర్పాట్లతోపాటు కరోనా సందర్భంగా శానిటైజర్లు, సామాజిక దూరాన్ని పాటించే ఏర్పాట్లనూ చేసింది. అంతేకాదు, ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్‌లను వేర్వేరుగా ఏర్పాటు చేసింది. అలాగే, అసెంబ్లీలోకి ప్రవేశిస్తున్న ప్రతి ఎమ్మెల్యేకు థర్మల్ పరీక్షలు నిర్వహించారు. అలాగే, కరోనా పాజిటివ్ ఉన్న ఎమ్మెల్యేలూ పీపీఈ కిట్లు ధరించి ఈ ఎన్నికల్లో తమ ఓటును నమోదు చేశారు.

కర్ణాటకలో నాలుగు సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, నలుగురు అభ్యర్థులు మాజీ పీఎం హెచ్‌డీ దేవెగౌడ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే, బీజేపీ అభ్యర్థులు ఇరన్నా కదాడి, అశోక్ గస్తీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఈసీ ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోనూ బీజేపీ అభ్యర్థి నబం రేబియా పోటీ లేకుండా రాజ్యసభ బెర్తును ఖరారు చేసుకున్నారు. ఈ రోజు మొత్తం పది రాష్ట్రాల్లో 24 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగాలి. కానీ, కర్ణాటక(నాలుగు సీట్లు), అరుణాల్ ప్రదేశ్(ఒక సీటు)లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 55 రాజ్యసభ సీట్లకు మార్చి 26న జరగేది. కానీ, కరోనా కారణంగా ఈసీ ఆ పోలింగ్‌ను వాయిదా వేసింది. కాగా, అందులో 37 మంది అభ్యర్థులు పోటీలేకుండానే రాజ్యసభ సీటును కైవసం చేసుకున్నారు.

Advertisement

Next Story